మమతకు సీఎం అయ్యే హక్కు లేదు

మమతకు సీఎం అయ్యే హక్కు లేదు

అగర్తల: బెంగాల్ సీఎంగా వరుసగా మూడోసారి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆమెపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఎమ్మెల్యేగా ఓడిన దీదీ.. సీఎం ఎలా అవుతారని బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ రీసెంట్‌‌గా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీదీపై త్రిపుర సీఎం బిప్లబ్ కుమాద్ దేవ్ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ఓడిన మమతకు ముఖ్యమంత్రి పీఠం ఎక్కే నైతిక అర్హత లేదన్నారు. 

‘గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఎన్నికల్లో పాల్గొనకుండానే సీఎం పీఠాన్ని అధిరోహించారు. కానీ మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో పోటీ చేసి ఓడిపోయారు. ఆమెను ప్రజలు నేతగా ఎన్నుకోలేదు. నైతికంగా చూస్తే సీఎం కుర్చీకి ఆమె దూరంగా ఉండాలి. నందిగ్రామ్‌ ఫలితాలపై కుట్ర పన్నారని ఆమె అంటున్నారు. ఆమె ఓటమి కోసం కుట్ర పన్నడం నిజమైతే, తృణమూల్ గెలుపు కూడా కుట్రే అవుతుంది’ అని బిప్లబ్ పేర్కొన్నారు.