ఆపరేషన్ థియేటర్​లో బర్త్ డే వేడుకలు

ఆపరేషన్ థియేటర్​లో బర్త్ డే వేడుకలు

తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వ హాస్పిటల్ లోని ఆపరేషన్ థియేటర్ ను సిబ్బంది బర్త్ డే పార్టీ వేదికగా మార్చారు. డిప్యూటీ డీఎంహెచ్ వో మురళీధర్ కొన్నేళ్లుగా ఈ హాస్పిటల్ లో డ్యూటీ చేస్తున్నారు. శనివారం ఆయన బర్త్ డే కావడంతో సిబ్బంది హాస్పిటల్ లో ఉన్న అన్ని రూమ్స్ కు తాళాలు వేసి ఆపరేషన్ థియేటర్ లో ఆట, పాటలతో పార్టీ చేసుకున్నారు.

హాస్పిటల్ ముందు భారీ ఫ్లెక్సీ కట్టడమే కాకుండా, ఆపరేషన్ థియేటర్ లో డీజే బాక్స్ లు పెట్టి, గోల చేస్తూ పార్టీ చేసుకోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిబ్బంది బిర్యానీతో పాటు మందు పార్టీ కూడా చేసుకున్నట్లు సమాచారం. ఈ హాస్పిటల్ కు ప్రతీ రోజు వందలాది మంది ఔట్ పేషెంట్లు వస్తుంటారని, వారిని పట్టించుకోకుండా డాక్టర్లు, సిబ్బంది పార్టీ చేసుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.