
ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘బైసన్’. దర్శకుడు పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ రూపొందించాడు. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 24న తెలుగులో విడుదల కానుంది. వీపీ బాలాజీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ధృవ్ మాట్లాడుతూ ‘ఈ మూవీ నాకెంతో స్పెషల్. ‘బైసన్’ కోసం మూడేళ్లు కష్టపడ్డా. తమిళంలో మా సినిమాకు మంచి ఆదరణ దక్కింది. తెలుగు ఆడియెన్స్ కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా.
మారి సెల్వరాజ్ గారు తన జీవితంలో ఎదురైన అనుభవాలు, చూసిన సంఘటనల నుంచే కథల్ని రాసుకుంటారు. అలాగే ఇది కూడా అందర్నీ ఇన్‌స్పైర్ చేసేలా ఉంటుంది’ అని అన్నాడు. అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘ఈ మూవీతో నేను చాలా నేర్చుకున్నా. ధృవ్‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది’ అని చెప్పింది.
నిర్మాత బాలాజీ మాట్లాడుతూ ‘ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. లింగుస్వామి, నా సోదరుడు చంద్రబోస్ గారి వల్లే తెలుగులోకి ఈ మూవీని తీసుకొస్తున్నాను. తెలుగు ఆడియెన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది’ అని అన్నారు. నీలం స్టూడియోస్ అధినేత వీపీఆర్, మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కె. ప్రసన్న పాల్గొన్నారు.