- రోజురోజుకూ పడిపోతున్న టెంపరేచర్లు
- అన్ని జిల్లాల్లో 15లోపే ఉష్ణోగ్రతలు
హైదరాబాద్/ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి విపరీతంగా పెరుగుతోంది. ఈశాన్యం నుంచి వీస్తున్న చలిగాలులే ఇందుకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాత్రి టెంపరేచర్లు 10 డిగ్రీల లోపు పడిపోతున్నాయి. ఏజెన్సీ ఏరియాలు గజగజ వణుకుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ లో అత్యల్పంగా 8.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 10.2, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 11.2, నిర్మల్ జిల్లా పెంబిలో 11.7, నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో 11.8, వికారాబాద్ జిల్లా యలాల్ లో 12, సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 12.1, కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ లో 12.2, జగిత్యాల జిల్లా భీమారంలో 12.5, మెదక్ జిల్లా హవేలీఘనపూర్ లో 12.8 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. మరో 13 జిల్లాల్లో 13 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
నిరుడు ఇదే టైంకి ఐదారు జిల్లాల్లోనే టెంపరేచర్లు 15 డిగ్రీల దిగువకు పడిపోగా.. ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాల్లోనూ 15 లోపే నమోదవుతున్నాయి. హైదరాబాద్ సిటీలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో 13.8 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత రికార్డు అయింది. రా జేంద్రనగర్ లో 14.7, మచ్చబొల్లారం, గచ్చిబౌలిలో 15, వెస్ట్ మారేడుపల్లిలో 15.2, శివరాంపల్లిలో 15.6, గాజుల రామారంలో 15.7 డిగ్రీలు నమోదయ్యాయి.
