
- కర్నాటకలో హోరాహోరీ
- కాంగ్రెస్, బీజేపీ మధ్య టైట్ ఫైట్
- ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ కు స్వల్ప ఆధిక్యం
- హంగ్ అసెంబ్లీకి కూడా చాన్స్.. కింగ్ మేకర్‌గా మళ్లీ జేడీఎస్?
- 70 శాతం పోలింగ్ నమోదు.. 13న ఫలితాలు
- 13న తేలనున్న అసలు ఫలితాలు
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. బుధవారం కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంతో ముందంజలో నిలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ స్వల్ప మెజార్టీతో అధికారంలోకి వస్తుందని పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేశాయి. పది ఎగ్జిట్ పోల్స్‌లో 5 పోల్స్ కాంగ్రెస్‌కు మెజార్టీని కట్టబెట్టాయి. 2 ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి మెజార్టీ వస్తుందని తేల్చాయి. మిగతా పోల్స్ మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందంటూ అంచనా వేశాయి. మళ్లీ కింగ్ మేకర్‌గా చక్రం తిప్పేందుకు జేడీఎస్‌కు అవకాశం దక్కనున్నట్లు తేల్చాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సరళిని బట్టి తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. అయితే, రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలని, తమదే గెలుపు ఖాయమని బీజేపీ నేతలు స్పష్టంచేశారు. తాము సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ సాధిస్తామని జేడీఎస్ కూడా ధీమా వ్యక్తం చేసింది.
2018లో ఇలా..
కర్నాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ కు 80, జేడీఎస్ కు 37 సీట్లు వచ్చాయి. కేపీజేపీకి ఒక సీటు రాగా, ఇండింపెండెట్ మరో సీటును గెలుచుకున్నారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో బీజేపీ ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ బలపరీక్షకు 3 రోజుల ముందే యడియూరప్ప రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ 14 నెలలు తిరగకముందే 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఆ పార్టీని పవర్ లోకి తెచ్చారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో 12 మంది గెలిచారు. బీజేపీ బలం116కు పెరిగింది. కాంగ్రెస్ 69, జేడీఎస్ 29 సీట్లకు పరిమితం అయ్యాయి.
బీజేపీకి స్వల్ప ఆధిక్యత వస్తుందన్న ‘న్యూస్ నేషన్’
కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కనీస మెజార్టీ (మ్యాజిక్ ఫిగర్) 113 సీట్లు అవసరం. అయితే, కాంగ్రెస్ 122 నుంచి 140 సీట్లతో స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీకి 62 నుంచి 80 సీట్లు, జేడీఎస్ కు 20 నుంచి 25 సీట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీ కనీస మెజార్టీ కంటే ఒక సీటు ఎక్కువగా 114 స్థానాలను గెలుస్తుందని న్యూస్ నేషన్–సీజీఎస్ పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు 86, జేడీఎస్ కు 21 సీట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీకి 94 నుంచి 117 సీట్లు, కాంగ్రెస్‌కు 91 నుంచి 106 వస్తాయని సువర్ణ న్యూస్ –జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ 110 నుంచి 120 సీట్లను గెలుచుకుంటుందని, బీజేపీ 80–90 సీట్లకు పరిమితం అవుతుందని ఇండియా టీవీ=సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
మొత్తం ఆసెంబ్లీ సీట్లు 224 మ్యాజిక్ ఫిగర్ 113