
బాన్సువాడ, వెలుగు: అంబులెన్స్డ్రైవర్నిర్లక్ష్యంగా కారణంగా ఓ వ్యక్తి ప్రాణం పోయిందని బీజేపీ, కాంగ్రెస్లీడర్లు ఆరోపించారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా హాస్పిటల్ముందు ధర్నా చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన బి.సాయిలు(38) కడుపు నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చేరాడు. అతనికి 17 ఏండ్ల కొడుకు ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు సాయిలు పరిస్థితి విషమించడంతో, డ్యూటీ డాక్టర్లు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సాయిలు కొడుకుకు సూచించారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పగా, గవర్నమెంట్అంబులెన్స్ లో తీసుకెళ్లమని డాక్టర్లు సూచించారు.
అంబులెన్స్ డ్రైవర్ దగ్గరకి వెళ్లి అడగగా రూ.500 డీజిల్ పోస్తేనే వస్తానని డిమాండ్చేయడంతో బాలుడికి ఏం చేయాలో తెలియక స్థానికంగా ఉండే బంధువుల వద్దకు వెళ్లాడు. తిరిగొచ్చే లోపు సాయిలు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్లీడర్లు హాస్పిటల్ముందు ధర్నా చేపట్టారు. అంబులెన్స్డ్రైవర్నిర్లక్ష్యంతోనే సాయిలు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పి పంపించారు.