
- ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ చీఫ్ జేపీ నడ్డా
- తెలంగాణ, ఒడిశా, బెంగాల్‌లకు ప్రభారీగా నియామకం
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్
- గతంలో బీజేపీ యూపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా చేసిన బన్సల్
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా సునీల్ బన్సల్ నియమితులయ్యారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ యూపీ సంస్థాగత వ్యవహారాల జనరల్ సెక్రటరీగా ఉన్న బన్సల్‌ను బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లకు ఇన్‌చార్జ్ (ప్రభారీ) బాధ్యతలు అప్పగించారు. జార్ఖండ్ వ్యవహారాల ఇన్‌చార్జ్(సంస్థాగత), కార్యదర్శిగా ఉన్న ధరంపాల్‌ను బన్సల్ స్థానంలో నియమించారు. యూపీలో కో-ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్న కరమ్‌వీర్‌కు జార్ఖండ్ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు.
వ్యూహకర్తగా పేరు
యూపీలోని లక్నో కు చెందిన సునీల్ బన్సల్కు స్ట్రాటజిస్ట్‌గా, సక్సెస్ ఫుల్ మ్యాన్‌గా పార్టీలో మంచి పేరుంది. ఏబీవీపీ నుంచి ఎదిగిన బన్సల్.. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా, బీజేపీలో వివిధ విభాగాల్లో సేవలందించారు. కేంద్ర మంత్రి అమిత్‌షాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల వేళ యూపీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత)గా పార్టీ ఆయనకు ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు. 80 సీట్లున్న యూపీలో 71 స్థానాల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
402 సీట్లున్న యూపీ అసెంబ్లీకి 2017 లో జరిగిన ఎన్నికల్లో 312 స్థానాలు గెలుచుకునేలా చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ లు మహాఘట్ బంధన్ గా ఏర్పడినా.. బీజేపీ అధిక స్థానాలు గెలుచుకునేలా వ్యూహాలు రచించి సక్సెస్ అయ్యారు. ఇటీవలి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి పార్టీని అధికారంలోకి తేవడంలో కీలకంగా పని చేశారు.
2024 ఎన్నికలే టార్గెట్
ఉత్తరాదిలో మాదిరి పశ్చిమ, దక్షిణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీలో యోచిస్తోంది. ఇందులో భాగంగా.. తెలంగాణపై పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా ఎంపీ స్థానాలే టార్గెట్ గా బన్సల్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఊహించని స్థాయిలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది. ఈ జోష్ ను 2024 లో నూ కొనసాగించాలని భావిస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ సహా 17 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. అలాగే వెస్ట్ బెంగాల్, ఒడిశాలోనూ మరిన్ని ఎంపీ సీట్లు గెలుచుకునేలా ఫోకస్ పెంచింది. మరోవైపు ప్రస్తుతం తెలంగాణ ప్రభారీగా ఉన్న తరుణ్ చుగ్ కు నేషనల్ జనరల్ సెక్రటరీతో పాటూ, జమ్మూ కశ్మీర్, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అదనపు బాధ్యతలు ఉన్నాయి. దీంతో ఆయన పూర్తి స్థాయిలో రాష్ట్రంపై ఫోకస్ చేసే పరిస్థితి లేదని అధిష్టానం భావించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అందుకే తెలంగాణకు
దక్షిణాదిలో కర్ణాటక తర్వాత, తెలంగాణలో బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల తర్వాత పార్టీ బలోపేతం అయింది. త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నిక పార్టీ కి సవాల్ గా మారింది. అందువల్ల ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుంటోంది. వాస్తవానికి అర్బన్ ఏరియాల్లో కమల దళంలో కనిపిస్తోన్న జోష్, గ్రామీణ ప్రాంతాల్లో లేదు. ఈ అంశాన్ని గమనించిన హైకమాండ్ క్షేత్రస్థాయిలో వ్యూహాలు రచించి, సమర్థవంతంగా అమలు చేయగలిగిన నేతలకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే బన్సల్ కు ఈ బాధ్యతలు కట్టబెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి ఒక్క నేతలతో టచ్ లోకి వెళ్లడం, స్థానిక రాజకీయ పరిస్థితులను తెలుసుకొని ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కరిస్తారనే పేరుంది. పార్టీ కి విఘాతం కలుగుతుందని తెలిస్తే ఎవరినీ ఉపేక్షించరనే పేరుంది. అలాగే ఎన్నికల్లో ఓటింగ్ ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలపై ఆయన స్పెషల్ ఫోకస్ పెడతారని పార్టీ నేతలు చెప్తున్నారు.