బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నం : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నం : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

కాంగ్రెస్‌‌‌‌కు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో బలంగా వాదించాలి: బీజేపీ స్టేట్​ చీఫ్​ రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచి కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. రిజర్వేషన్లకు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ‘‘బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్​లో ఉంది. అందుకే సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్​ను బెంచ్ డిస్మిస్ చేసింది. అంతే తప్ప వేరే కారణమేమీ లేదు’’అని రాంచందర్ తెలిపారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘హైకోర్టులో కేసు పెండింగ్‌‌‌‌లో ఉన్నప్పుడు, ముందు అక్కడే వాదనలు వినిపించాలని సుప్రీం కోర్టు చెప్పడం సహజమే. దీనిపై మంత్రులు హడావుడి చేసి.. ఢిల్లీకి వెళ్లి ఏదో సాధించామని చెప్పడం విడ్డూరంగా ఉంది. 

కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో న్యాయనిపుణులతో బలంగా వాదనలు వినిపించి బీసీలకు న్యాయం చేయాలి’’అని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.‘‘హైదరాబాద్, సికింద్రాబాద్‌‌‌‌లో సిటీ బస్సుల కనీస చార్జీని ఒక్కసారిగా రూ.10కి పెంచడం దారుణం. వెంటనే చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలో ముగ్గురితో కమిటీ వేశాం. కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థిని ప్రకటిస్తాం. ఈ బై ఎలక్షన్​లో విజయం మాదే’’అని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాగా, మహేశ్వరం నియోజకవర్గం నుంచి ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. మోదీ ప్రభుత్వం చేపడ్తున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముస్లిం మైనారిటీలు లబ్ధి పొందుతున్న నేపథ్యంలో, బీజేపీలో పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయని రాంచందర్ రావు తెలిపారు.