గడీలపాలన విముక్తి కోసమే.. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

గడీలపాలన విముక్తి కోసమే.. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వెలుగులోకి తెచ్చేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది. మొదటి విడత పాద యాత్ర 2021 ఆగస్టు 24న హైదరాబాద్​లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమై అక్టోబర్​ 2 గాంధీ జయంతి రోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ముగిసింది. ఎంతో మంది ప్రజలు వారి కష్టాలు, సమస్యలు పాదయాత్రలో చెప్పుకున్నారు. మొదటి విడత పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ వచ్చింది. అదే స్ఫూర్తితో ఏప్రిల్14 బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి రోజు జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతోంది.

స్వరాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలు, సకల జనులు రోడ్డెక్కారు. తీవ్ర నిర్భందాలు, అణచివేతలు, లాఠీ దెబ్బలకోర్చి పట్టు విడువకుండా ఆందోళన చేపట్టారు. ఇలా వందలాది మంది యువకుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇయ్యాల కల్వకుంట్ల కుటుంబ గడీల పాలనలో బందీ అయింది. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో, ప్రజా స్వామిక తెలంగాణ నిర్మాణంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమి, ఇంటికో ఉద్యోగం, పోడు భూములకు పట్టాలు, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత వంటి హామీలతో ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌ పార్టీ వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. రాష్ట్రంలో 10 శాతం ఉన్న గిరిజనులకు ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అవకాశం ఉన్నా.. అలాంటి చర్యలు ఏమీ చేపట్టకపోవడం గిరిజనుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 46 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని, అందుకు 73 ఎకరాల భూమి 53 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు బుట్ట దాఖలయ్యాయి. డబుల్‌ బెడ్‌రూమ్‌ వంటి పేదల గృహనిర్మాణాలకు భూమి కొరత ఉందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలా మారి ప్రభుత్వ భూములను తెగనమ్ముతోంది. పేదలకు కేటాయించిన అసైన్డ్‌ భూములపై కూడా కన్నేయడం దళిత, గిరిజన, బలహీన వర్గాలపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. 

కొత్త పింఛన్లు ఏమాయె..

టీఆర్‌ఎస్‌ నాయకులు అవినీతికి పాల్పడితే రాళ్లతో కొట్టి చంపండన్న కేసీఆర్‌ ఇప్పుడు మొత్తం తెలంగాణ ప్రభుత్వమే అవినీతి కూపంలో మునిగి తేలుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, ఇదే తరహా పథకాన్ని రూపొందించి గిరిజన బంధు, బీసీ బంధు, మహిళా బంధు వంటి పథకాలు అమలు చేయాలన్న ఆయా వర్గాల ప్రజల డిమాండ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చెవికెక్కడం లేదు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్లిస్తోంది. రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ల కోసం11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,15,262 మంది అర్హులని రాష్ట్ర ప్రభుత్వ అధికారులే తేల్చారు. ఏప్రిల్‌1 నుంచి అమలు కావాల్సిన ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడం పింఛన్‌ దారుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిదర్శనం. కొత్త రేషన్‌ కార్డుల మంజూరు  ఊసేలేదు. కుటుంబంలో ఒకరికే పెన్షన్‌ ఇస్తామంటున్న కేసీఆర్‌ తన కుటుంబంలో మాత్రం నలుగురిని ప్రజా ప్రతినిధులను చేశారు. రైతులకు రుణమాఫీ, గిట్టుబాటు ధర అమలు, దళారుల దోపిడీ నుంచి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం చేష్టలిడిగి చూస్తోంది. రాష్ట్రంలో కౌలు రైతుకు కనీస రక్షణ లేదు. యాసంగి వడ్ల కొనుగోళ్లపై కేంద్రంతో చేసుకున్న ఒప్పందాన్ని మరుగునపెట్టి కేంద్రమే కొనాలంటూ టీఆర్‌ఎస్‌ నేతలు వీధి నాటకాలకు తెరలేపారు. ఐకేపీ కేంద్రాల నుంచి సేకరించే ధాన్యం ఎఫ్‌సీఐ గోడౌన్లకు చేరేవంత వరకు అయ్యే ప్రతీపైసా ఖర్చు కేంద్రమే భరిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. మిల్లర్లతో కుమ్మక్కైన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతికందుతున్న పంటను కొనకుండా ఆలస్యం చేస్తూ రాష్ట్ర రైతులకు నష్టం చేస్తోంది. ఇటీవల ఎఫ్‌సీఐ అధికారులు తెలంగాణలో ఉన్న  రైస్‌మిల్లుల్లో చేసిన సోదాల్లో గత ఏడాదికి సంబంధించి 1.81 లక్షల క్వింటాళ్ల ధాన్యం అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఆ రిపోర్టులు రాష్ట్ర ప్రభుత్వానికి, పౌరసరఫరాల శాఖకు అందాయి. అయినా వాటిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదు.

అటు ఉద్యోగాలు లేవు.. ఇటు ఆరోగ్యం లేదు..

 తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది. ఆర్టీసీ కార్మికులు మొదలు పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు నడిపిన సకల జనుల సమ్మె యావత్‌ దేశం దృష్టినే ఆకర్షించింది.  టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టాక నేడు అదే ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల మెడపై కత్తిపెట్టి, బెదిరింపులకు పాల్పడుతూ వారికి న్యాయంగా ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలను కూడా కల్పించడంలేదు. పీఆర్సీ సిఫార్సులను ఇప్పటికీ అమలు చేయకపోగా రెండు పెండింగ్‌ డి.ఏ ల బకాయిలను సైతం చెల్లించలేదు. బిస్వాల్‌ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణలోని ప్రభుత్వశాఖల్లో 1 లక్షా 91 వేల ఖాళీలు ఉండగా ప్రభుత్వం 91,147 పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకుంది. న్యాయ నిపుణులు, విద్యారంగం మేధావులతో చర్చించి కోర్టువివాదాలకు తావులేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. రాష్ట్రంలో వైద్య రంగం పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కంటినొప్పికి, పంటి నొప్పికి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వైద్యానికి వెళుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రంలో వైద్యసదుపాయాలు మెరుగుపరచాలనే కనీస శ్రద్ధ లేదు.  ఏ జబ్బు వచ్చినా గరీబోడు ఉస్మానియా, గాంధీ దవాఖానాలకే పోవాలి. అక్కడ ఎలుకలు, పిల్లులు, వీధి కుక్కలు స్వైర విహారం చేస్తుంటే ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు ఏం భరోసా ఉంటుందో ఏలే వారే వివరించాలి. 

సామాజిక అంశాలు పట్టించుకోని ప్రభుత్వం..

ఇప్పటికీ  ఆ అనుభవాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ నేర్చుకున్నట్లుగా కనబడటం లేదు. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు ‌రీఎంబర్స్​మెంట్‌, స్కాలర్‌షిప్‌ల పెంపు వంటి చర్యలవైపు ప్రభుత్వం కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ మిగులు రాష్ట్రమని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6 వేల కోట్ల విద్యుత్‌ ఛార్జీల భారాన్ని మోపి ప్రజల నడ్డి విరిచింది. ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్‌ బిల్లుల సర్ధుబాటు పేరుతో  అనేకసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచింది. ఆర్టీసీ ఛార్జీలను రెండుసార్లు పెంచి సామాన్యునికి ప్రభుత్వం చుక్కలు చూపించింది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటి పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రజలకు ఉపశమనం కల్పించకపోగా విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు పెంచి ఖజానా నింపుకునే చర్యలు ఏ మాత్రం సమర్థనీయం కావు. 

బీజేపీ పాదయాత్రల లక్ష్యం..

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిడులు, గోవధ, దేవాలయాలపై దాడులను అరికట్టడంలో శ్రద్ధ చూపని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మతతత్వ మజ్లీస్​తో అంటకాగడంలో మాత్రం అమితాసక్తిని చూపిస్తోంది. ప్రభుత్వ ప్రజా కంటక పాలనను ఎండగట్టడం, ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్య ముఖుల్ని చేసేందుకు  పాదయాత్రను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. కేంద్రంలో ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రానికి అందిస్తున్న నిధులు, పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని మౌలిక లక్ష్యాలైన జాతీయవాదం, జాతి సమైక్యత, ప్రజాస్వామ్యం, సమతాయుక్త్‌, సర్వమత సమభావం విలువలతో కూడిన రాజకీయాలను ప్రచారం చేయడం లక్ష్యంగా బీజేపీ పాదయాత్రతో ముందుకు వెళ్తుంది.
- బంగారు శృతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీజేపీ తెలంగాణ