బీజేపీ అవినీతి లీడర్లనే కొనగలదు

బీజేపీ అవినీతి లీడర్లనే కొనగలదు

కోల్‌‌కతా: పశ్చిమ బెంగాల్‌‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీదీ కోటపై పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అధికార తృణమూల్ పార్టీలోని కీలక నేతలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే టీఎంసీ కీలక నేతలైన సువేందు అధికారి, రాజీవ్ బెనర్జీ, వైశాలి దాల్మియా, ప్రవీర్ ఘోషల్, రతిన్ చక్రవర్తి, రుద్రానీ ఘోష్ రీసెంట్‌‌గా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ విషయంపై తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. అవినీతి లీడర్లను బీజేపీ కొనగలదేమో గానీ తృణమూల్‌‌ పార్టీకి అంకితమై పని చేస్తున్న వర్కర్లను కొనలేదని మండిపడ్డారు.

‘త‌ృణమూల్ కాంగ్రెస్‌‌లో అవినీతి నేతలకు చోటు లేదు. ఎవరైనా అధికార పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకంటే నిరభ్యంతరంగా వెళ్లొచ్చు. మేం ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. బెంగాల్‌లో తిరిగి మా పార్టీనే పవర్‌లోకి వస్తుంది. బీజేపీ ఓ గ్యాస్ బెలూన్ లాంటిది. అది కేవలం మీడియా వార్తల్లోనే బతికే పార్టీ. ఆ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి. అందుకే ఏజెంట్లకు డబ్బులిచ్చి వీధుల్లో జెండాలతో ర్యాలీలు నిర్వహిస్తారు. వాళ్లును అదే చేయనివ్వాలి. కానీ టీఎంసీ ప్రజల గుండెల్లో సజీవంగా ఉండే పార్టీ’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.