బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి కలిసి నటించిన చిత్రం' యానిమల్ 'ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఈ చిత్రం సీక్వెల్ ' యానిమల్ పార్క్' పైనే. ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ ను హీరో రణబీర్ కపూర్ స్వయంగా వెల్లడించారు.
ఎప్పుడు ప్రారంభం?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి రణబీర్ కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం డెరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. రెబల్ స్టార్ ప్రభాస్ తో ' స్పిరిట్ ' మూవీ షూటింగ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ మూవీ పూర్తయిన తర్వాతే 'యానిమల్ పార్క్' పై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఈ సినిమాను 2027లో ప్రారంభించే అవకాశం ఉంది. దానికి ఇంకా చాలా సమయం ఉంది అని రణబీర్ స్పష్టం చేశారు. అయితే ఈ సీక్వెల్ లో రణబీర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. తొలి భాగం చివరలో చూపించిన విధంగా.. క్లోన్ పాత్ర ద్వారా కథ మరింత రసవత్తరంగా మారనుందని సమాచారం.
ద్విపాత్రాభినయంలో రణబీర్..
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను మూడు భాగాలుగా చిత్రీకరించాలని ఫ్లాన్ లో ఉన్నట్లు రణబీర్ తెలిపారు. అందులో రెండో భాగానికి 'యానిమల్ పార్క్' పేరును నిర్థారించినట్లు చెప్పారు. మొదటి సినిమా నుండే డైరెక్టర్ ఈ కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై తనతో పంచుకుంటున్నారని తెలిపారు. 'యానిమల్' కన్నా డబుల్ బడ్జెట్ తో ఈ సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి పాత్రలు ఈ భాగంలో మరింత కీలకం కానున్నాయి. 'యానిమల్' కంటే 'యానిమల్ పార్క్' మరింత క్రూరంగా, డార్క్‌గా ఉంటుందని సందీప్ రెడ్డి వంగా గతంలోనే హింట్ ఇచ్చారు.
భారీ అంచనాలతో..
2023 డిసెంబర్ 1న విడుదలైన 'యానిమల్' తండ్రీకొడుకుల మధ్య ఉండే వికృతమైన బంధాన్ని ఆవిష్కరించి బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు 'యానిమల్ పార్క్' అంతకు మించిన అంచనాలతో రాబోతోంది. 2027లో షూటింగ్ మొదలైతే, 2028 చివరలో లేదా 2029 ప్రారంభంలో ఈ యాక్షన్ డ్రామాను వెండితెరపై చూసే అవకాశం ఉంటుంది. అప్పటివరకు రణబీర్ అభిమానులు ఆయన తదుపరి ప్రాజెక్టులైన 'రామాయణ' , 'లవ్ అండ్ వార్' చిత్రాలతో సరిపెట్టుకోవాల్సిందే..
