AUS vs PAK: వరల్డ్ కప్ ముందు క్రేజీ సిరీస్: ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్, స్క్వాడ్, టైమింగ్ వివరాలు!

AUS vs PAK: వరల్డ్ కప్ ముందు క్రేజీ సిరీస్: ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్, స్క్వాడ్, టైమింగ్ వివరాలు!

వరల్డ్ కప్ ముందు మరో క్రేజీ సిరీస్ క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి సిద్ధంగా ఉంది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ గురువారం (జనవరి 29) జరగనుంది. ఈ మ్యాచ్ కు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిధ్యమివ్వనుంది. ఆస్ట్రేలియా జట్టును మిచెల్ మార్ష్ లీడ్ చేయనున్నాడు. మరోవైపు పాకిస్థాన్ జట్టుకు సల్మాన్ అలీ అఘా నడిపించనున్నాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను ఓడించాలని పాకిస్థాన్ గట్టి పట్టుదలగా ఉంది. మరోవైపు వరల్డ్ కప్ ముందు ఉపఖండపు పరిస్థితులు అర్ధం చేసుకొని వరల్డ్ కప్ కు బరిలోకి దిగాలని కంగారూల జట్టు భావిస్తుంది. 

ఓ వైపు ఇండియా, న్యూజిలాండ్ జట్లు విశాఖపట్నం వేదికగా ఈ రోజు నాలుగో టీ20 ఆడుతుంటే మరోవైపు ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు రేపు లాహోర్ లో తొలి టీ20 ఆడనున్నాయి. ఈ రెండు రోజులు ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఖాయంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా జట్టులో కీలక స్టార్లు జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్ స్వల్ప గాయాల కారణంగా సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదు. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, కూపర్ కొన్నోలీ, మిచ్ ఓవెన్ రూపంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తుంది.
 
పాక్ జట్టులో బాబర్, అఫ్రిది:  

ఇటీవలే జరిగిన బిగ్ బాష్ లీగ్ లో రాణించకపోయినా పాకిస్థాన్ టీ20 జట్టులో బాబర్ అజామ్ కు చోటు కల్పించారు. బిగ్ బాష్ లీగ్ లో బాబర్ 11 మ్యాచ్‌ల్లో 103.06 స్ట్రైక్ రేట్‌తో కేవలం 202 పరుగులు మాత్రమే చేశాడు. వరల్డ్ కప్ ముందు టోర్నీ కావడంతో బాబర్ అనుభవాన్ని పాక్ క్రికెట్ బోర్డు వినియోగించుకోవాలని చూస్తున్నట్టు అర్ధమవుతోంది. బాబర్ తో పాటు స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది కూడా ఎంపికయ్యాడు. కొంతకాలంగా పాకిస్థాన్ టీ20 జట్టుకు దూరంగా ఉన్న అఫ్రిది జట్టులో చేరాడు. స్టార్ ప్లేయర్స్ మహ్మద్ రిజ్వాన్, హరిస్ రౌఫ్ వంటి సీనియర్ ఆటగాళ్లను పాకిస్థాన్ జట్టు నుండి తొలగించింది.

►ALSO READ | IND vs NZ: హై స్కోరింగ్ థ్రిల్లర్‌కు రంగం సిద్ధం.. నాలుగో టీ20కి పిచ్ రిపోర్ట్, వాతావరం ఎలా ఉందంటే..?

ఆస్ట్రేలియాతో తలపడే పాకిస్తాన్ 16 మంది సభ్యుల జట్టు:

సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్ , ఫఖర్ జమాన్, ఖవాజా మహ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్     

ఆస్ట్రేలియా జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, మహ్లి బియర్డ్‌మాన్, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, జాక్ ఎడ్వర్డ్స్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా
  
లైవ్ స్ట్రీమింగ్. లైవ్ టెలికాస్టింగ్ ఎందులో చూడాలంటే..?

భారత కాలమాన ప్రకారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వెబ్ బ్రౌజర్‌లలోని సోనీ లివ్ యాప్ లో చూడొచ్చు.