వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు తగ్గొచ్చు : శశి థరూర్

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు తగ్గొచ్చు  : శశి థరూర్

2024 లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గుతాయని.. 2019 విజయాన్ని పునరావృతం కావడం అసాధ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు 50సీట్లు తగ్గుతాయని, కాలం కలిసిరాకపోతే అధికారం కోల్పోయే ఛాన్సుందని జోస్యం చెప్పారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన ఈ కామెంట్లు చేశారు. బీజేపీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా.. చాలా రాష్ట్రాలను ఆ పార్టీ కోల్పోయిందన్నారు. 

2019లో హర్యానా, గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలిచిన విషయాన్ని శశి థరూర్ గుర్తుచేశారు. బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఒక స్థానం మినహా మిగిలిన సీట్లను ఆ పార్టీ గెల్చుకుందని, పశ్చిమ బెంగాల్‌లోనూ 18 స్థానాల్లో విజయం సాధించిందని అన్నారు. 2024లో ఆ రాష్ట్రాల్లో సేమ్ రిజల్ట్ రిపీట్ కాకపోవచ్చని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. ఆయా రాష్ట్రాల్లో 50 సీట్ల వరకు తగ్గొచ్చని, అది విపక్షాలకు ప్లస్ అవుతుందని అన్నారు.

బీజేపీ 250 స్థానాలకు పరిమితమై.. ఇతర పార్టీలు 290 స్థానాల్లో విజయం సాధించినా పరిస్థితి పరిస్థితి ఎలా ఉండబోతుందో చెప్పలేమని శశిథరూర్ అన్నారు. విపక్షాలు ఏకతాటిపైకి వస్తాయా లేక  ఆ పార్టీల నుంచి 30 మందిని కమలదళం తమవైపు తిప్పుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 సీట్లకుగాను బీజేపీ 303 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 52 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.