18 నెలల్లో మూసీ ప్రక్షాళన చేయిస్తా : గూడూరు నారాయణ రెడ్డి

18 నెలల్లో మూసీ ప్రక్షాళన చేయిస్తా : గూడూరు నారాయణ రెడ్డి

యాదాద్రి, వెలుగు : తాను గెలిచిన 18 నెలల్లోనే కాలుష్యంతో నిండిపోయిన మూసీ నదిని ప్రక్షాళన చేయిస్తానని భువనగిరి బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు.  మంగళవారం బీబీనగర్, మక్త అనంతారం, వెంకిర్యాల, పడమటి సోమరం, రహీంఖాన్ గూడెం, రాఘవాపుర్​ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో మాట్లాడుతూ.. మూసీ కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు. ఎమ్మెల్యే పదవిలో కూర్చున్న వారెవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  తాను గెలిస్తే మూసీని బాగుచేయడంతో పాటు ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయించి 30 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని,  స్టూడెంట్స్​కు పోటీ పరీక్షల కోసం కోచింగ్​ ఇప్పిస్తానని మాటిచ్చారు.  సొంత ఖర్చులతో డిగ్రీ కాలేజీ కట్టిస్తానని  ప్రకటించారు. 

ఎస్సీలతో కలిసి భోజనం

రాఘవాపురంలో ఎస్సీ కాలనీలో  ప్రచారం నిర్వహించిన ఆయన.. మధ్యాహ్నం వారితో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం ఏండ్ల తరబడి ఉద్యమం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు.  ప్రధాని మోదీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేయిస్తున్నారని, ఆయనకు ఎస్సీలు అండగా  నిలబడాలని కోరారు. ప్రచారంలో నేతలు పడమటి జగన్ మోహన్ రెడ్డి, నర్ల నర్సింగ్ రావు, చిక్క క్రిష్ణ, సురకంటి జంగా రెడ్డి, వెంకటేశ్, దేవయ్య, విజయ్ భాస్కర్ రెడ్డి, రమేశ్, క్రిష్ణారెడ్డి, బాలకృష్ణారెడ్డి, శ్రీనివాస్, లాలయ్య ఉన్నారు.