నిరుద్యోగులు, ఉద్యోగులంతా మా వైపే

నిరుద్యోగులు, ఉద్యోగులంతా మా వైపే

హనుమకొండ, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానంలో నిరుద్యోగులు, ఉద్యోగులంతా బీజేపీ వైపే ఉన్నారని, ఆ పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి అన్నారు. హనుమకొండలోని బీజేపీ ఎలక్షన్ ఆఫీస్​లో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్​చార్జిలు కామారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల శంకర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థికి సొంత పార్టీ సపోర్ట్ లేదని ఎద్దేవా చేశారు.

నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాల ఉద్యమాలు చేసిన తనకు పట్టభద్రులు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మేధావుల నుంచే మార్పు మొదలు కావాలని, ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ  హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, గంట రవి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కేసీఆర్ కు వీఆర్ఎస్ ఇచ్చిండ్రు..

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : తెలంగాణ ప్రజలు మాజీ సీఎం కేసీఆర్​కు వీఆర్ఎస్ ఇచ్చిండ్రని మాజీ ఎమ్మెల్యే రఘునందన్​రావు ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ మండలం శివునిపల్లిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డికి మద్దతుగా శనివారం  గ్రాడ్యుయేట్ ఓటర్ల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే నోట్లు తీసుకోండ్రి..జేబులో పెట్టుకోండ్రి..ఓటు మాత్రం బీజేపీకి వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.