బంగారు తెలంగాణ అని తాగుబోతుల తెలంగాణ చేసిండు

బంగారు తెలంగాణ అని తాగుబోతుల తెలంగాణ చేసిండు
  • గిరిజనుల ఓట్ల కోసమే గిరిజన బంధు నాటకం
  • ఓట్ల రాజకీయం తప్ప.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు
  • భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో బైక్‌‌ ర్యాలీలో పాల్గొన్న వివేక్‌‌‌‌ 

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, మొగుళ్లపల్లి, వెలుగు: సీఎం కేసీఆర్‌‌ కూతురు కవిత లిక్కర్‌‌‌‌ స్కాంలో ఇరుకున్నందున, ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆయన దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని తాగుబోతుల తెలంగాణ చేసిండని ఫైర్‌‌‌‌ అయ్యారు. ప్రజలంతా ఏకమై అవినీతి పరుడైన కేసీఆర్‌‌‌‌ను గద్దె దించి, ఫాం హౌస్‌‌కే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర పేరిట పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో సోమవారం బైక్‌‌‌‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వివేక్‌‌‌‌ వెంకటస్వామి రంగాపూర్‌‌‌‌లోని గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరించి, వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ములకపల్లి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

అందర్నీ మోసం చేసిండు

రుణ మాఫీ చేస్తానని రైతులను, డబుల్‌‌‌‌ బెడ్రూం ఇండ్లు ఇస్తానని పేదలను, ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతకు కేసీఆర్‌‌‌‌ మోసం చేసిండని వివేక్‌‌ వెంకటస్వామి మండిపడ్డారు. తెలంగాణలో ఎవరికి ఉద్యోగాలు రాకున్నా.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం వచ్చాయన్నారు. ఓట్ల రాజకీయం తప్ప, రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదన్నారు.  కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని చెప్పారు. గిరిజనుల ఓట్ల కోసమే గిరిజన బంధు అని నాటకాలు మొదలుపెట్టారని ఆరోపించారు. కాళేశ్వరం ఓ బోగస్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ అని, తన ఫామ్‌‌ హౌస్‌‌కు నీళ్లు తెచ్చుకోవడానికి రూ.లక్ష కోట్లతో ఈ ప్రాజెక్ట్‌‌ను కట్టారని అన్నారు. మొన్నటి వానలకు వేల కోట్ల విలువ చేసే మోటార్లు నీటిలో మునిగిపోవడానికి సీఎం కేసీఆరే కారణమన్నారు. ఎన్నికల హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని.. కేసీఆర్‌‌‌‌ పచ్చి అబద్ధాల కోరు అని మండిపడ్డారు. 

మునుగోడులో గెలిచేది బీజేపీ అభ్యర్థే..

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌‌‌‌ రెడ్డి గెలుపు ఖాయమని వివేక్‌‌‌‌ అన్నారు. ప్రజలను ఎంత మభ్యపెట్టినా కేసీఆర్‌‌‌‌ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రధాని మోడీ దేశాభివృద్ధికి పాటుపడుతుంటే టీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలు ఓర్వలేక ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా అవినీతిలో అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, కాంట్రాక్ట్‌‌‌‌లు కూడా వాళ్లే చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేలు ఇచ్చి ఓటర్లను కొని మళ్లీ అధికారంలోకి రావాలని ప్లాన్‌‌‌‌ చేస్తున్నారని ఆరోపించారు. రూ.5 వేలకు ఓటు అమ్ముకుంటే రోజుకు 3 రూపాయలకు మనం అమ్ముడుపోయినట్లేనన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా శక్తి ఉందని, దీన్ని ఉపయోగించి టీఆర్‌‌‌‌ఎస్‌‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, రాష్ట్ర నాయకులు రాంచంద్రారెడ్డి, నాగపూరి రాజమౌళి, వెన్నంపల్లి పాపయ్య, జిల్లా నాయకులు రవీందర్‌‌ రెడ్డి, శేషగిరి, రాజయ్య, గాజుల రజిత మల్లయ్య పాల్గొన్నారు.