ఇది వికాసానికి, వినాశనానికి మధ్య పోరు.. బిహార్ ఎన్నికలపై బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా కామెంట్

ఇది వికాసానికి,  వినాశనానికి మధ్య పోరు.. బిహార్ ఎన్నికలపై బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా కామెంట్
  • తేజస్వీ హామీలు ఆచరణ సాధ్యం కావు: రవిశంకర్‌‌ 
  •     అది గఠ్ బంధన్​ కాదు.. థగ్ బంధన్‌: గిరిరాజ్‌ సింగ్‌

హజీపూర్‌: 
బిహార్‌‌ ఎన్నికల్లో వికాసానికి, వినాశనానికి మధ్య పోరు జరుగుతున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ.. రంగ్‌దారి (దోపిడీ), జంగల్​రాజ్​(అరాచకం), దాదాగిరి(బెదిరింపులు)కి ప్రతీక అని విమర్శించారు. బిహార్‌‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో నడ్డా ప్రసంగించారు. కాంగ్రెస్..​ తన కూటమి భాగస్వామ్య పార్టీలను అంతం చేసే పరాన్నజీవి అని అన్నారు. 

యువతకు ఉద్యోగాలిచ్చి వలసలు అరికడతామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఇచ్చిన హామీలు వింటుంటే.. గతంలో ఆర్జేడీ ప్రమేయం ఉన్న ల్యాండ్​ ఫర్ జాబ్‌ స్కామ్ గుర్తొస్తున్నదని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన ఆర్జేడీ.. ఆ ఉద్యోగులకు చెల్లించేందుకు నిధులు ఎక్కడినుంచి వస్తాయో చెప్పాలన్నారు. గ్యాంగ్‌స్టర్లకు ఆ పార్టీ టికెట్లు ఇస్తున్నదని, ఇది బిహార్‌‌ భద్రతకే ప్రమాదమన్నారు.  

ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే..

బిహార్ లోని ప్రతిపక్ష కూటమి గఠ్ బంధన్ కాదని, అది థగ్ బంధన్ (దొంగల కూటమి) అని కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​అన్నారు.  కొడుకు తేజస్వీయాదవ్‌ను లాలూప్రసాద్​ బలవంతంగా సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించేలా చేశారని ఎద్దేవా చేశారు. తమ ఎన్డీయే కూటమి సీఎం అభ్యర్థి నితీశ్​ కుమారేనని తెలిపారు.  కాగా, తేజస్వీ యాదవ్‌  హామీలు ఆచరణ సాధ్యం కావని బీజేపీ ఎంపీ రవిశంకర్‌‌ ప్రసాద్​ అన్నారు. ‘‘2.6 కోట్ల ఇండ్లలో కనీసం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని తేజస్వీ  హామీ ఇచ్చారు. దీనికి రూ.12 లక్షల కోట్లు ఖర్చవుతుంది.  బిహార్ బడ్జెట్ రూ. 3 లక్షల కోట్లు. ఈ ఉద్యోగాలనుఎలా ఇస్తారు?” అని ప్రశ్నించారు.