నా వెనుక ఉన్నది మోదీ మాత్రమే.. వాళ్ళ కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరంలేదు: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

నా వెనుక ఉన్నది మోదీ మాత్రమే.. వాళ్ళ కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరంలేదు: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
  • 60శాతం పదవులు కొత్తవారికి ఇవ్వాలన్నది నిర్ణయం
  • ఆ ప్రకారమే బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పడింది
  • యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం

హైదరాబాద్: తన వెనుక ఎవరూ లేరని, ఉన్నది ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని బీజేపీ స్టేట్ చీఫ్​ రాంచందర్ రావు తెలిపారు. ఇవాళ ఆయన రాజాసింగ్ వ్యాఖ్యలకు పరోక్షంగా మీట్ ది ప్రెస్ లో కౌంటర్ ఇచ్చారు. కొందరి కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కార్యకర్తలకు పార్టీ అన్యాయం చేయదని, 60 % కొత్తవారికి, 40% పాతవారికి అవకాశం ఇవ్వాలని పార్టీలో నిబంధన ఉందని తెలిపారు. ఆ ప్రకారమే కమిటీ ఏర్పడిందని, అందరికీ అవకాశాలు వస్తాయని అన్నారు. పార్టీలో ఇంకా 600 పోస్టులు ఉన్నాయని తెలిపారు. 

కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామని, పార్టీలో అసమానతలు లేవని అన్నారు. పనిచేసే వాళ్ళను కమిటీలో తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియాతో బ్లాక్ మార్కెట్ చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కృత్రిమ కొరత ఏర్పడటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు.  హైడ్రా కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తలాబ్ కట్టా కి వెళ్ళి హైడ్రా సర్వే చేసిందా ? అక్కడికి వెళ్లగలరా ?  అని  ప్రశ్నించారు.  ఇండియా అలయెన్స్ లో ఐక్యత కొరవడిందని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూశారని చెప్పారు.  

►ALSO READ | కాళేశ్వరంపై సీబీఐ కేసుకు.. బీజేపీ కొత్త మెలిక

మోడీ, అమిత్ షా లతో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఖర్గే మాట్లాడుతున్నారని,  ఎమర్జెన్సీ కన్నా ప్రమాదం ఏముంటుంది ఖర్గే చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖను కాంట్రాక్టు వ్యవస్థతో నడిపించడం దురదృష్టకరమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండేండ్లు గడిచినా వ్యవస్థలేవీ సక్రమంగా పనిచేయడం లేదని అన్నారు. తెలంగాణలో పాలనకు పక్షవాతం వచ్చిందని అన్నారు.