తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనాలి.. గన్నీ బ్యాగులు.. లారీలు అందుబాటులో లేవు

తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనాలి.. గన్నీ బ్యాగులు.. లారీలు అందుబాటులో లేవు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌రావు

దేవరకొండ (చింతపల్లి), వెలుగు : వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌‌‌. రాంచందర్‌‌‌‌రావు విమర్శించారు. నల్గొండ జిల్లా చింతపల్లిలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 25 రోజులుగా వడ్ల కొనుగోళ్లు జరగకపోవడం, ఐకేపీ కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీలు, టార్పాలిన్లు అందుపాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రం కొనుగోళ్లకు సంబంధించిన నిధులు సమకూరుస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వడ్లు కొనడం లేదని మండిపడ్డారు. 

తేమ, తరుగు పేరుతో బస్తాకు 4కిలోల కోత విధిస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. హమాలీ చార్జీలను కూడా రైతుల నుంచి వసూలు చేయడం అన్యాయం అన్నారు. అకాల వర్షం కారణంగా వడ్లు, మక్కలు, పొద్దుతిరుగుడు తడిసి మొలకలు వస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని సైతం కొనాలని డిమాండ్‌‌‌‌ చేశారు. అంతకుముందు చింతపల్లిలోని షిర్డి సాయి దేవాలయంలో సాయినాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌‌‌‌రెడ్డి, మనోహర్‌‌‌‌రెడ్డి, కల్యాణ్‌‌‌‌నాయక్‌‌‌‌, లాలునాయక్, రాములు, రామరాజుయాదవ్ పాల్గొన్నారు.