
హైదరాబాద్,వెలుగు: ప్రజలు స్వదేశీ వస్తువుల కొనుగోలుకు ప్రయారిటీ ఇవ్వడాన్ని పెంచుకోవాలని, తద్వారా స్థానిక పరిశ్రమలు, తయారీదారులకు మద్దతు లభిస్తుందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచందర్ రావు అన్నారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఆలకించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘లోకల్ ఫర్ గ్లోబల్’ నినాదాన్ని గురించి ప్రధాని మోదీ సూటిగా చెప్పారని ఆయన వెల్లడించారు.
మన మార్కెట్‌ను మనమే పెంచుకోవాల్సిన, అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. స్వదేశీ వినియోగంతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇది నేటి తక్షణ అవసరమని పేర్కొన్నారు. దేశంలో గొప్ప మాన్యుఫాక్చరింగ్ సామర్థ్యం ఉందని, ఇది చాలా దేశాల్లో లేదని ప్రధాని మోదీ నొక్కి చెప్పినట్లు గుర్తుచేశారు.
రేపు హైటెక్స్‌లో సమావేశం..
ఈ నెల 30న హైటెక్స్ లో జరగబోయే ‘మేరా దేశ్ పహలే-ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోదీ’ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగింది. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. దేశం అభివృద్ధిలో ముందుండేలా మోదీ తీసుకొచ్చిన ఆవిష్కరణాత్మక నిర్ణయాలను, వివిధ కార్యక్రమాలను వివరిస్తూ ఈ వేడుక ద్వారా యువతకు స్ఫూర్తి కలిగేలా చూడాలన్నారు.
హైదరాబాద్ కార్పొరేటర్లు నగర అభివృద్ధి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, జీఎస్టీ తగ్గింపుతో జరిగే మేలు ప్రజలకు గురించి వివరించాలని పిలుపునిచ్చారు. అనంతరం హైటెక్స్ లో జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించిన పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పర్యవేక్షించారు.