ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాల ఆందోళనలు

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాల ఆందోళనలు
  • కేసీఆర్​పై ప్రతిపక్షాల మండిపాటు
  • నేడు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ దీక్షలు
  • ఇయ్యాళ, రేపు కాంగ్రెస్​ దీక్షలు, దిష్టిబొమ్మ దహనాలు
  • గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసనలకు బీఎస్పీ పిలుపు

దేశ రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కోసం తాను ప్రతిపాదిస్తున్నట్లు సీఎం కేసీఆర్​ చేసిన కామెంట్లపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ‘‘రాజ్యాంగాన్ని  కాదు.. నిన్నే మార్చాలి” అంటూ సీఎంపై మండిపడ్డాయి. మొదటి నుంచి దళితులను కేసీఆర్​ మోసం చేస్తున్నారని, ఇప్పుడు రాజ్యాంగం మార్చాలంటూ కొత్త కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్​ వద్ద అంబేద్కర్​ విగ్రహానికి బీజేపీ నేతలు పాలాభిషేకం చేసి కేసీఆర్​ తీరుపై నిప్పులు చెరిగారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ‘భీం దీక్షలు’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. కామెంట్లను వెనక్కి తీసుకొని,ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీఎంను పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. గురువారం, శుక్రవారం 48 గంటలపాటు దీక్షలు చేపడుతామని, రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్​ విగ్రహాల ఎదుట కేసీఆర్​ 

దిష్టిబొమ్మలు దహనం చేస్తామని చెప్పారు. సీఎం బాధ్యతారహితంగా మాట్లాడారని, దీనిపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసనలు తెలపాలని బీఎస్పీ స్టేట్​ కో ఆర్డినేటర్​ ఆర్​.ఎస్​. ప్రవీణ్​కుమార్​ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్​ విగ్రహాల వద్దకు చేరుకొని కేసీఆర్​ మాటలను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు.