
శనివారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జాబ్ మేళా పై బీజీపీ నాయకులు మండిపడుతున్నారు. జాబ్ మేళా అనేది ఒత్తుత్తి కార్యక్రమం అని.. ఇదంతా ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి రాజకీయ స్టంట్ అని బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి కొట్టిపారేశారు. దీనివల్ల నిరుద్యోగులకు ఒరిగిందేమి లేదని చెప్పారు. ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తెలిసి.. సీఎం కేసీఆర్ దృష్టిలో ఉండాలనే ఉద్దేశంతో ఏవేవో కార్యక్రమాలు చేస్తున్నాడని మండిపడ్డారు. జాబ్ మేళా పేరుతో ఫ్లెక్సీలు పెట్టి హంగామా చేశారని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా... ఎమ్మెల్యేలు జాబ్ మేళాలు ఏర్పాటు చేసి యువతను మోసగిస్తున్నారని తెలిపారు.
ఎల్బీనగర్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఎలాంటి పెద్ద కంపెనీలు పాల్గొనలేదని.. మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్స్ మార్కెటింగ్ కొరకు నిరుద్యోగులకు ఎరవేశాయని మధుసూదన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నియోజకవర్గ పరిధిలో ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. ముందు వాటిని భర్తీ చేయండని ఆయన అన్నారు. జాబ్ మేళా వల్ల ఎంతమంది నిరుద్యోగులకు అపాయింట్ లెటర్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. జాబ్ మేళాకు స్టేడియంలో ఏర్పాట్లకు జీహెచ్ఎంసీ నిధులు ఖర్చు చేసి, ధృవ్ అనే ఏజెన్సీకి డబ్బులు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు.