కొల్చారం పోస్టాఫీస్ లో రూ. 8 లక్షలు గోల్ మాల్..మోసపోయిన ఖాతాదారులు..న్యాయం చేయాలని ఆందోళన

కొల్చారం పోస్టాఫీస్ లో రూ. 8 లక్షలు గోల్ మాల్..మోసపోయిన ఖాతాదారులు..న్యాయం చేయాలని ఆందోళన

కొల్చారం, వెలుగు : మెదక్​జిల్లా కొల్చారం పోస్టాఫీసులో రూ. లక్షల్లో గోల్ మాల్ జరిగింది. 9 మంది ఖాతాదారులకు చెందిన దాదాపు రూ. 8 లక్షలను ఆఫీసు సిబ్బందే కాజేసినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నర్సింలు అనే వ్యక్తి నాలుగు విడతలుగా రూ.5 లక్షలు, చాకలి ఆగమయ్య అనే మరో వ్యక్తి రూ. లక్ష, ఇంకొందరు పోస్టాఫీసులో డిపాజిట్ చేశారు. అదే గ్రామానికి చెందిన పోస్టుమాస్టర్ లంబాడి రవి అనారోగ్యంతో 4 నెలల కింద ఆత్మహత్య చేసుకున్నాడు. 

అనంతరం పోస్టాఫీసులో ఆడిట్ఉందని,  డిపాజిటర్ల ఖాతాలకు ఆధార్ అనుసంధానించాలని పోస్టాఫీసు అసిస్టెంట్ శేఖర్ నెల కింద ఖాతాదారుల ఇండ్లకు వెళ్లి పాస్ పుస్తకాలు, డిపాజిట్ పత్రాలను తీసుకెళ్లాడు. వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో  పోస్టాఫీసు చుట్టూ తిరుగుతున్నా ఫలితంలేదు. అనుమానం వచ్చిన ఖాతాదారులు చెక్ చేయగా డబ్బులు డిపాజిట్ కాలేదని తెలిసింది. 

దీంతో అవాక్కైన బాధితులు పోస్టాఫీస్ లో పనిచేసే శేఖర్ ను పిలిచి నిలదీస్తే.. తనకు పైసలు ఇవ్వలేదంటూ బుకాయించాడు. దీంతో గురువారం పంచాయితీ ఆఫీసు వద్ద పెద్ద మనుషుల్లోకి  పిలిచినా రాలేదు. అనంతరం తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోస్టాఫీసు వద్ద ఆందోళన చేశారు.  వెంటనే జిల్లా అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.