దేశ ప్రజలపై ఆర్ధిక దాడి జరుగుతోంది

దేశ ప్రజలపై ఆర్ధిక దాడి జరుగుతోంది
  • సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
  • హనుమకొండలో ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు

హనుమకొండ జిల్లా: దేశ ప్రజలపై ఆర్ధిక దాడి జరుగుతోందని..పెట్టుబడి దారులకు విపరీతాంగా లాభాలొస్తుంటే..కోట్లాది మందికి బతుకుదెరువు లేకుండా పోయిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో సంక్షోభం పెరిగిపోయిందని.. 62 శాతం యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు.

హనుమకొండ పట్టణంలోని ఫాతిమానగర్ బాలవికాసలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగుతున్న ఈ సమావేశాలకు జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఏ.విజయరాఘవన్, చెరుపల్లి సీతారాములు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం తదితరులు హాజరయ్యారు. 
ఈ సందర్భంగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లయినా ఇప్పటికీ రాజ్యాంగంపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాద ఘర్షణలుపెంచిపోషిస్తున్నారని, విదేశాల్లో గాంధీ పేరుతో, దేశంలో గాడ్సే పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఏజెన్సీల ద్వారా ప్రతిపక్షాలను బ్లాక్ మెయిల్ చేస్తోందని, చరిత్రను వక్రీకరించి బలపడాలని  బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. వామపక్షాలను బలోపేతం చేసి కేంద్రంపై పోరాడుతామని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.