ఉమ్మడి మెదక్​ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్​ జిల్లా సంక్షిప్త వార్తలు
  • కాంగ్రెస్​ కౌన్సిలర్ల దీక్ష
  • పాత హద్దుల్లోనే మార్కెట్లు నిర్మించాలని డిమాండ్​

చేర్యాల, వెలుగు: చేర్యాల టౌన్​లో  పాత హద్దులతోనే వెజ్,  నాన్​ వెజ్​ మార్కెట్​ నిర్మించాలని డిమాండ్​ చేస్తూ  కాంగ్రెస్​ కౌన్సిలర్లు బుధవారం ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. అభివృద్ది పేరుతో అంబేద్కర్​ చౌరస్తాను కుదించకుండా పాత పద్దతిలో రోడ్డును వదలి నిర్మాణం చేపట్టాలని  కౌన్సిలర్లు చెవిటి లింగం, ఉడుముల ఇన్నమ్మ భాస్కర్​రెడ్డి, తుమ్మలపల్లి లీలా సంజీవులు, సందుల సురేశ్,   ముస్త్యాల తారా యాదగిరి కోరారు. కౌన్సిల్​ తీర్మానంలో  తాము  సంతకాలు చేసినట్టు  టీఆర్​ఎస్​ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. మార్కెట్​ నిర్మాణానికి సంబంధించిన  తీర్మానం మీద  సంతకాలు చేశామని,  రోడ్డు వెడల్పు విషయంలో కాదని స్పష్టం చేశారు.  మద్దూరు జడ్పీటీసీ,  సిద్దిపేట జిల్లా జడ్పీ ఫ్లోర్​ లీడర్​ గిరి కొండల్​రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్దికి తాము  వ్యతిరేకులం కాదని,  పాలక పార్టీ అభివృద్ధి  పేరిట నాటకాలాడుతోందని విమర్శించారు.  దీక్షకు వివిధ పార్టీలు  సంఘీభావం తెలిపాయి.   

రాజకీయ లబ్ది  కోసమే దీక్ష – టీఆర్​ఎస్​

రాజకీయ లబ్ది కోసం  కాంగ్రెస్​ కౌన్సిలర్లు నిరాహార దీక్ష చేస్తున్నారని  టీఆర్​ఎస్​ పట్టణ అధ్యక్షుడు ఎం. నాగేశ్వర్​రావు విమర్శించారు. బుధవారం ఆయన  విలేకర్లతో మాట్లాడుతూ,  అంబేద్కర్​ విగ్రహం, రోడ్డు విస్తరణపై  తప్పుడు ప్రచారం చేస్తున్నారని,   ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి  ఇప్పటికే రోడ్డు, విగ్రహం యథావిధిగా ఉంటాయని ప్రకటించినా టీఆర్​ఎస్​ను   బద్నాం చేస్తున్నారన్నారు.  పట్టణ అభివృద్ది కొరకు మంత్రి హరీశ్​రావు సహకారంతో రూ. కోట్లలో ఫండ్స్​తెస్తుంటే అభివృద్దిని అడ్డుకోవడమేంటని నిలదీశారు.  సమావేశంలో  మార్కెట్​ వైస్​ చైర్మన్​ పి. వెంకట్​రెడ్డి తదితరులు  పాల్గొన్నారు. 

  • చట్టాల గురించి తెలుసుకోండి
  • గీతం స్టూడెంట్లతో  జిల్లా సివిల్ జడ్జి హనుమంతరావు

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు:  మన చట్టాలు, రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా న్యాయసేవాఅధికార సంస్థ సెక్రటరీ, సీనియర్​ సివిల్​ జడ్జి జె. హనుమంతరావు అన్నారు. పటాన్​చెరు లోని  గీతం డీమ్డ్​ యూనివర్శిటీలో బుధవారం  న్యాయ  సేవా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  చట్టాలపై  అవగాహన ఉంటే  కేసులను సులువుగా పరిష్కరించుకోవచ్చని, పైసా ఖర్చు లేకుండా న్యాయ సేవాఅధికారి సంస్థ రాజీ కుదురుస్తుందని చెప్పారు. రాజ్యాంగంలో  అధికరణలు, హక్కులు, బాధ్యతలపై వివరించారు.  గీతం స్కూల్​ ఆఫ్ ఆర్కిటెక్చర్​ డైరెక్టర్​ ప్రొఫెసర్​ ఎస్​. సునీల్​ కుమార్​, స్కూల్​ ఆఫ్​ ఫార్మసీ  ప్రిన్సిపల్​ ప్రొఫెసర్​ జీఎస్​ కుమార్​ పాల్గొన్నారు. 

గీతంలో  ' లక్ష్య ' 


గీతం బిజినెస్​ స్కూల్​ ఆధ్వర్యంలో లక్ష్య పేరిట క్రీడా పోటీలను డీఎస్పీ భీంరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ పోటీలు మూడు రోజులపాటు కొనసాగుతాయి.   క్రీడా జ్యోతిని వెలిగించిన అనంతరం  డీఎస్పీ భీంరెడ్డి, సీఐ వేణుగోపాల్​ రెడ్డి తదితరులు క్రికెట్ ఆడారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని గీతం వీసీ ప్రొఫెసర్​ డీఎస్​ రావు  అన్నారు. 

  • పారదర్శకంగా కేసుల విచారణ
  •  ఇన్ చార్జి  సీపీ  రమణ కుమార్ 

సిద్దిపేట రూరల్, వెలుగు: అన్ని కేసులను  పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని  సిద్దిపేట ఇంచార్జి సీపీ, సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేట డివిజన్ పోలీస్ ఆఫీసర్లతో పెండింగ్ కేసులపై రివ్యూ చేశారు.  కేసుల్లో శిక్షల శాతం పెంచాలని  సూచించారు. కేసు నమోదు చేసినప్పటి నుంచి  చార్జిషీట్ వేసే వరకు పక్కాగా పరిశోధన చేయాలన్నారు.  గంజాయి, గుట్కా, పేకాటను పూర్తిగా  అరికట్టాలని,   పోక్సో, ఎస్సీ ఎస్టీ  కేసుల్లో 60 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు.  సైబర్ నేరాలపై  ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏసీపీ  దేవారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ఫణీంద్ర, సీఐలు  పాల్గొన్నారు. కానిస్టేబుల్, ఎస్ఐ  ప్రిలిమనరీ టెస్ట్ లో క్వాలిఫై  అయిన అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు సహకారంతో  సిద్దిపేట లో  ఫిజికల్ ట్రైనింగ్ ఉచిత శిక్షణ ప్రారంభించినట్టు  రమణ కుమార్ తెలిపారు. శిక్షణలో  భాగంగా పురుషులకు 1600 మీటర్ల రన్నింగ్, మహిళలకు 800 మీటర్స్ రన్నింగ్ , షాట్ పుట్, లాంగ్ జంప్ తదితర అంశాల్లో ట్రైనింగ్​ ఇవ్వనున్నట్టు  చెప్పారు. 250 మంది అభ్యర్థులకు  మంత్రి హరీశ్ రావు పౌష్టికాహారాన్ని  పంపిణీ చేస్తున్నారన్నారు.  

  • బీజేపీ పతనం మునుగోడు నుంచే మొదలు
  • ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి,  ఎమ్మెల్సీ యాదవరెడ్డి 

జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు: మునుగోడు నుంచి రైతు వ్యతిరేక మోడీ ప్రభుత్వ పతనం మొదలయ్యిందని   రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. బుధవారం మండలం పరిధిలోని ఇటిక్యాల, పీర్లపల్లి, చాట్లపల్లి, తిగుల్ నర్సాపూర్ లలో వారు  పీఏసీఎస్, ఐకేపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,  సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని, దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుబంధు, రైతుబీమా లాంటి స్కీమ్​లను తీసుకొచ్చారని అన్నారు. కరెంట్​మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్న బీజేపీ సర్కారుకు  రైతులు తగిన బుద్ది చెప్తారన్నారు. ఇతర రాష్ట్రాల్లో  చిన్న ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం  హోదా ఇవ్వడంలేదన్నారు. ఎఫ్సీఐ రాష్ట్రంలో కొనుగోళ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.  కార్యక్రమంలో ఎంపీపీ  బాలేశంగౌడ్, జడ్పీటీసీ  సుధాకర్ రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపిటీసిల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, సర్పంచులు, లీడర్లు పాల్గొన్నారు.

కోనుగోలు కేంద్రాల్లోనే మద్దతుధర

సిద్దిపేట రూరల్, వెలుగు:ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకుని ప్రతి రైతు  మద్దతు ధర  పొందాలని సుడా  చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు.  బుధవారం రూరల్ మండలం  పుల్లూరు, మాచాపూర్, పెద్దలింగారెడ్డి పల్లి, రావురూకుల, చిన్నగుండవెల్లి, సీతారాం పల్లి, తోర్నాల,   అర్బన్ మండలంలోని  ఎన్సాన్ పల్లి, తడ్కపల్లి, నారాయణరావుపేట మండల పరిధిలోని మల్యాల, బంజేరుపల్లి, కోదండరావుపల్లి గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. పూర్తిగా ధాన్యాన్ని ఆరబెట్టిన తరువాతనే కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.  ఈ కార్యక్రమాల్లో  ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు,  జడ్పీటీసీ శ్రీహరి గౌడ్, వైస్ ఎంపీపీ యాదగిరి, ఆయా గ్రామాల సర్పంచులు కవిత రవీందర్, పంజా భాగ్యలక్ష్మీ బాలయ్య, ఏర్వ రమేశ్​, ఎల్లవ్వ, తౌటి ఉదయశ్రీ తిరుపతి, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చిటుకుల ప్రసాద్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,  నాయకులు మచ్చ 
వేణుగోపాల్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ నల్ల నరేందర్ రెడ్డి   తదితరులు పాల్గొన్నారు.

డ్రాఫ్ట్​ ఓటర్​ జాబితాల విడుదల

మెదక్​ టౌన్/సంగారెడ్డి టౌన్​, వెలుగు : సంగారెడ్డి, మెదక్​ జిల్లాల డ్రాఫ్ట్​ ఓటర్​ లిస్టులను బుధవారం ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలో  11,95,883 మంది ఓటర్లు ఉండగా,  ఇందులో 6,05,871 మంది పురుషులు, 5, 89, 997 మంది మహిళలు, 35 మంది ఇతరులు ఉన్నట్లు  జిల్లా కలెక్టర్ డాక్టర్​ ఏ.శరత్​తెలిపారు.  బుధవారం ఈ లిస్ట్​ను  జిల్లాలోని 1560 పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించినట్లు చెప్పారు.  అభ్యంతరాలొస్తే పరిశీలించి  2023 జనవరి 5న తుది జాబితా ప్రచురిస్తామన్నారు. 2023జనవరి 1 నాటికి 18ఏండ్లు నిండిన వారంతా  ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.   నారాయణఖేడ్ నియోజకవర్గం లో  మొత్తం 2,02,473 మంది, అందోల్ నియోజకవర్గంలో  2,23,043 మంది, జహీరాబాద్ నియోజకవర్గంలో 2,36,707 మంది,  సంగారెడ్డి నియోజకవర్గంలో 2,12,639 మంది ,  పటాన్​చెరు నియోజకవర్గంలో 3,21,021 మంది ఓటర్లున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 365 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని చెప్పారు.  

మెదక్​లో...  

 అర్హత కలిగిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని మెదక్​ జిల్లా అడిషనల్​ కలెక్టర్​ రమేశ్ అన్నారు. బుధవారం  రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన  సమావేశంలో డ్రాఫ్ట్ ఓటర్​లిస్ట్​ను విడుదల చేశారు. ఓటరు జాబితాపై   జనవరి 6 నుంచి  సెప్టెంబర్ 30 వరకు  అభ్యంతరాలు తీసుకున్నామని, వాటిని  పరిశీలించి జాబితా  సవరించామని చెప్పారు.  డ్రాఫ్ట్​లిస్ట్​ మేరకు జిల్లాలో  మొత్తం 4,06,629 ఓటర్లున్నారని చెప్పారు. మెదక్ నియోజక వర్గంలో 2,01,358 మంది,  నర్సాపూర్ నియోజకవర్గంలో 2,05,271 మంది ఓటర్లున్నారని వివరించారు.  ఓటర్​ కార్డుతో ఆధార్​ అనుసంధానంలో  76 శాతం పూర్తి చేసి మొదటిస్థానంలో ఉన్నట్టు చెప్పారు. అనంతరం కలెక్టరేట్  ఆడిటోరియంలో ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్, కళాశాల అంబాసిడర్లు, హెచ్​ఎంలు, ప్రిన్సిపాల్స్​తో జరిగిన  సమావేశంలో పాల్గొన్నారు.  ఎన్నికల కమిషన్  సులువుగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి పలు అవకాశాలు కల్పించిందని, ఈమేరకు 17 ఏళ్ల నుంచే యువతకు అవగాహన కల్పించాలని సూచించారు.   ఆర్డీవో సాయిరామ్​, స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి,  డీఈఓ రమేశ్​  కుమార్ తదితరులు పాల్గొన్నారు.  

 

  • కొనలేకుంటే సెంటర్లు  మూసేయండి
  •  జిన్నారంలో రైతుల ఆగ్రహం

 జిన్నారం/మెదక్​, వెలుగు:  జిన్నారంలోని ఐకేపీ సెంటర్​లో కొనుగోలు నిలిపివేయాలంటూ బుధవారం రైతులు నిరసనకు దిగారు. గన్నీబ్యాగులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. వడ్లు కొనడం చేతకాకపోతే సెంటర్ ను మూసేయాలని డిమాండ్​ చేశారు. గోనె సంచులు ఇవ్వకపోవడంవల్ల పొలం నుంచి రోడ్డు మీదికి, అక్కడ నుంచి ఐకేపీ సెంటర్ కు ధాన్యాన్ని తరలించడం కష్టమవుతోందని, టాన్స్​పోర్ట్​ చార్జీలు పెరుగుతున్నాయని సింహారెడ్డి అనే రైతు వాపోయారు. సెంటర్​లో హమాలీ కింద రూ.40 వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం 17 శాతం తేమ పరిమితి పెట్టగా.. 14 శాతం ఉంటేనే కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం దగ్గర వడ్లు ఆరబోసేందుకు స్థలం లేక రోడ్ల మీద ఎండబోసుకుంటున్నామని, దీంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళనలో రైతులు జనార్దన్ గౌడ్, మహేందర్ గౌడ్, శేఖర్ , రాఘవేందర్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మిల్లుల్లో సరిపడా హమాలీ లు లేకపోవడంతో సెంటర్ల నుంచి వెళ్లిన వడ్లు అన్​లోడ్​ కావడం లేదని మెదక్​లో రైతులు ఆరోపిస్తున్నారు. మెదక్​ జిల్లాలోని పలు రైసుమిల్లుల్లో ఒక్కో ట్రాక్టర్, లారీ​ అన్​లోడ్​ అయ్యేందుకు నాలుగు రోజుల దాకా పడుతోంది. దీంతో మిల్లుల వద్ద లారీలు, ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయని రైతులు అంటున్నారు. అన్​లోడింగ్​సమస్యలను నిరసిస్తూ మండల కేంద్రమైన కొల్చారం, రంగంపేట గ్రామాల్లో రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు.

 

  • కష్టపడి చదివితేనే ఎదుగుతారు
  •  నర్సాపూర్​ జూనియర్ సివిల్ జడ్జి అనిత

మెదక్​ (కౌడిపల్లి), వెలుగు: స్టూడెంట్స్​ఏదో  ఒక లక్ష్యాన్ని పెట్టుకుని కష్టపడి చదివితే జీవితంలో ఎదుగుతారని నర్సాపూర్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి అనిత అన్నారు. కౌడిపల్లి మండలం రాయిలాపూర్ జడ్పీహెచ్​ఎస్​లో  బుధవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు.   వివిధ చట్టాలపై స్టూడెంట్స్​కు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, డ్రంక్ అండ్ డ్రైవ్, బాల కార్మిక వ్యవస్థ గురించి తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కురుమ షేకులు, అడ్వకేట్లు జాఫర్, మధుశ్రీ,  శ్రీనివాస్, ప్రకాశ్ పాల్గొన్నారు.


కూరగాయల సాగుపై   మహిళారైతులకు అవగాహన

మెదక్ (శివ్వంపేట), వెలుగు: కూరగాయల సాగుపై  మహిళా రైతులకు అవగాహన కల్పించారు. శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్​మహిళారైతులను సెహగల్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం  జీడిమెట్లలోని ఇంటర్నేషనల్ హార్టికల్చర్ క్రాప్ రీసెర్చ్ సెంటర్ కు తీసుకెళ్లారు. పొలాల్లో, ఇంటి పెరట్లో కూరగాయల  సాగు విధానం గురించి వివరించారు.   ఏ సీజన్​లో ఎలాంటి కూరగాయలు సాగు చేయాలో, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో, ఏ ఎరువులు వాడాలో తెలియజేశారు.