కొత్త చీఫ్‌‌ల కోసం బీజేపీ కసరత్తు

కొత్త చీఫ్‌‌ల కోసం బీజేపీ కసరత్తు

లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన  ముగ్గురు స్టేట్‌‌ ప్రెసిడెంట్లు కేంద్ర కేబినెట్‌‌లో చేరారు. దీంతో వారి స్థానాల్లో కొత్తవారిని నియమించడంపై బీజేపీ దృష్టిపెట్టింది. కేంద్ర హోంమంత్రిగా అమిత్‌‌ షా  పదవీ బాధ్యతలు చేపట్టడంతో   బీజేపీ కొత్త చీఫ్‌‌ పదవి పైనా ఊహాగానాలు  వినిపిస్తున్నాయి.   ఉత్తరప్రదేశ్‌‌, బీహార్‌‌,  మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర చీఫ్‌‌లు లోక్‌‌సభకు ఎన్నికవ్వడంతోపాటు వాళ్లంతా మోడీ మంత్రివర్గంలో  చేరిపోయారు. బీజేపీలో ‘ఒక వ్యక్తి- ఒక పదవి’ అన్న  రూల్‌‌  అమలవుతోంది.  ఈ నిబంధన ప్రకారం  ఈ నలుగురూ స్టేట్‌‌ ప్రెసిడెంట్లుగా, మంత్రులుగా  ఏకకాలంలో ఉండేందుకు  వీలుండదు.  ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ఆర్గనైజేషనల్‌‌ పోస్టుల్లో ఉండడానికి మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు. ఉదాహరణకు బీజేపీ చీఫ్‌‌గా, రాజ్యసభ సభ్యునిగా అమిత్‌‌ షా రెండు పదవుల్లో ఉండేవారు. ప్రభుత్వంలోనూ, పార్టీ పోస్టుల్లోనూ ఒకరు ఏకకాలంలో  కొనసాగడమన్నది బీజేపీలో చాలా అరుదుగా  జరుగుతుంది.

మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌‌ రావు సాహెబ్‌‌ దన్వే వినియోగదారుల వ్యవహారాలశాఖ సహాయమంత్రిగా నియమితులయ్యారు.  మరికొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కొద్దికాలంపాటు ఆయన పార్టీ చీఫ్‌‌గా కొనసాగుతారా లేకుంటే  ఆయన స్థానంలో అమిత్‌‌ షా మరో నాయకుణ్ని నియమిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

బీహార్‌‌  పార్టీ స్టేట్‌‌ ప్రెసిడెంట్‌‌ నిత్యానంద్‌‌ రాయ్‌‌ హోంశాఖ సహాయమంత్రిగా నియమితులయ్యారు. ఆయన స్థానంలో  కేంద్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి రాధామోహన్‌‌ సింగ్‌‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌‌ అయ్యే అవకాశం ఉందని  తెలుస్తోంది. రాయ్‌‌ కన్నా ముందు  స్టేట్‌‌ చీఫ్‌‌గా ఉన్న మంగల్‌‌పాండే బ్రాహ్మణ కులానికి చెందినవారుకాగా, రాధా మోహన్‌‌ సింగ్‌‌ ఠాకూర్‌‌ కేస్ట్‌‌కు చెందినవారు.  నిత్యానంద్‌‌ రాయ్‌‌ యాదవ కమ్యూనిటీకి చెందిన నేత. ఈసారి స్టేట్‌‌ చీఫ్‌‌ పదవి పెద్దకులానికి దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

మోడీ సర్కార్‌‌లో బీజేపీ యూపీ చీఫ్‌‌ మహేంద్రనాథ్‌‌ పాండే  స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ మినిస్టర్‌‌గా  చేరారు. పాండే ప్లేస్‌‌లో మనోజ్‌‌ సిన్హాకు  ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   మనోజ్‌‌ సిన్హా ఘజియాపూర్‌‌ లోక్‌‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు.  సిన్హా భూమిహార్‌‌ కులానికి చెందినవారు. ఈ కులం యూపీ జనాభాలో కేవలం 2.5% మంది మాత్రమే ఉన్నారు.  మనోజ్‌‌ సిన్హా  ప్రధానికి, మోడీకి సన్నిహితులన్న పేరుంది.   ఇంతకుముందు బీజేపీ రాష్ట్ర చీఫ్‌‌ గా ఉన్న సూర్య సిన్హా కూడా భూమిహార్‌‌ కులానికి చెందినవారు.

రాజస్థాన్‌‌ బీజేపీ చీఫ్‌‌గా  ఇన్ఫర్మేషన్‌‌  అండ్‌‌ బ్రాడ్‌‌కాస్టింగ్‌‌ మాజీ మంత్రి రాజ్యవర్థన్‌‌ సింగ్‌‌ రాథోడ్‌‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  గత ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు గజేంద్ర సింగ్‌‌ షెకావత్‌‌ను స్టేట్‌‌ చీఫ్‌‌గా నియమించాలని అమిత్‌‌ షా అనుకున్నా అప్పటి  సీఎం వసుంధర రాజె అభ్యంతరం చెప్పడంతో  ఆయన నియామకం ఆగిపోయింది. రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో  రాజపుత్ర నాయకుడు రాజ్యవర్థన్‌‌ సింగ్‌‌ను  ఈసారి స్టేట్‌‌ ప్రెసిడెంట్‌‌గా నియమించేందుకు పార్టీ హైకమాండ్‌‌ ఆలోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.