సోనియాగాంధీ వ్యాఖ్యలపై దుమారం

 సోనియాగాంధీ వ్యాఖ్యలపై దుమారం

విమర్శలు..ప్రతి విమర్శలతో కర్ణాటకలో పొలిటికల్ హీట్ నెలకొంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీ జోరు పెంచాయి. ఇందులో భాగంగా హుబ్లీలో సోనియాగాంధీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేగుతున్నాయి. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

కర్ణాటక హుబ్లీలో జరిగిన ప్రచారంలో సోనియా గాంధీ సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించారు. కర్ణాటక రాష్ట్ర ప్రతిష్ట, సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదని  సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. సోనియా ఆ స‌భ‌లో మాట్లాడిన విష‌యాన్ని  కాంగ్రెస్  ట్వీట్‌ చేసింది. అయితే సోనియా సార్వభౌమాధికారం అన్న ప‌దాన్ని వాడ‌డం ప‌ట్ల బీజేపీ అభ్యంత‌రం వ్యక్తం చేసింది.  మే 8వ తేదీ సోమవారం ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులను బీజేపీ నేతలు కలిశారు.  సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.  సార్వభౌమ‌త్వాన్ని దేశం కోసం వాడుతామ‌ని.. అందుకే సోనియాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ఈసీని బీజేపీ నేతలు  కోరారు.

సార్వభౌమాధికారం అనే పదాన్ని సోనియా గాంధీ కావాలనే  ఉపయోగించారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మండిపడ్డారు.  కాంగ్రెస్ మేనిఫెస్టో పనికిమాలినదని అందుకే అలాంటి పదాలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.  కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే కూడా సోనియా గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.  కాంగ్రెస్ మేనిఫెస్టో  తుక్డే తుక్డే ముఠా ఎజెండా అని.. అందుకే ఇలాంటి పదాలు వాడుతున్నారని మండిపడ్డారు.