రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలపై కన్ను

రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలపై కన్ను

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై బీజేపీ కసరత్తు చేస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి బరిలో నిలిస్తే ఎలా ఉంటుందనే విషయంపై పార్టీ నేతలు దృష్టి సారించారు. రెండేండ్ల క్రితం జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సీఎం కేసీఆర్ కూతురు కవితపై బీజేపీ తన అభ్యర్థిని నిలిపింది. ఆమె ఎన్నిక ఏకపక్షం కాకుండా చూడటంలో బీజేపీ కొంత సక్సెస్ అయిందని అప్పట్లో పార్టీ నేతలు భావించారు. వచ్చే నెల10న జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును ఏకపక్షం కాకుండా నిలువరించేందుకు పోటీ చేస్తామని పార్టీ ధీమాగా ఉంది. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం పరిధిలో జీహెచ్ఎంసీకి చెందిన కొన్ని నగర శివారు డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఆ పార్టీకి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉన్నారు. ఇదీగాక సికింద్రాబాద్ ఎంపీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్​ ఉన్నారు. అక్కడ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకుంది. కొన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలున్నాయి. దీంతో అక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. కరీంనగర్ ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్​లో కూడా బీజేపీ కార్పొరేటర్లు, పలు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు ఉన్నారు. కొన్ని ఎంపీటీసీ స్థానాలు కూడా బీజేపీకి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి పోటీ చేసే అంశంపై సంజయ్ కసరత్తు చేస్తున్నారు. ఈ మూడు స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీ బరిలోకి దిగడంపై బీజేపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. మూడు, నాలుగు రోజుల్లో దీనిపై ఓ స్పష్టత రానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.