
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లోని నారాయణ గూడలోని రూ. 8కోట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొమ్ము బీజేపీకి చెందినదిగా గుర్తించిన ఆదాయపు శాఖ.. ఆ వ్యవహారంపై గురువారం క్లీన్ చిట్ ఇచ్చింది.
ఆదాయపు శాఖకు చెందిన శ్రీనివాసరావు అనే అధికారి.. ఈ విషయంపై స్పందిస్తూ.. నగదు పట్టుబడిన సమయంలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని, వారందరిని విచారించగా.. అందరి దగ్గర నుంచి ఒకే రకమైన సమాధానమొచ్చిందని తెలిపారు. దొరికిన సొమ్ముకు సంబంధించి నారాయణ గూడ బ్యాంకు అకౌంట్ స్టేట్ మెంట్, బ్యాంకు వారికి బీజీపీ ఆఫీస్ రాసిన లెటర్ లను పరిశీలించామని.. అన్ని ఆధారాలు సరిగానే ఉన్నాయని అన్నారు. పట్టుబడిన నగదు, బ్యాంకు నుంచి డ్రా చేసిన సొమ్ము.. రెండూ మ్యాచ్ అయ్యాయని ఈ సందర్భంగా నారాయణ గూడ ఇన్స్ పెక్టర్ కు తెలిపారు.
అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఆ నగదు బీజేపీ నేత, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి సంబంధించిందని, ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకే ఈ డబ్బును తరలిస్తున్నట్టుగా కీలక వ్యాఖ్యలు చేసింది. బీజేపీ మాత్రం ఆ ఆరోపణలన్నింటిని తోసి పుచ్చుతూ.. ఆ డబ్బు వివిధ సంస్థలు మరియు వ్యక్తులకు చెల్లించేందుకే డ్రా చేశామని తెలిపింది.