ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

జన్నారం,వెలుగు: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమని... రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. అజాదీకా అమృత్​ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఇందన్ పెల్లి నుంచి మండల కేంద్రవరకు బైక్​ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ బాపూరావు హాజరయ్యారు. జన్నారంలోని అంబేద్కర్​విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర  అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోడీ మొదటి విడతలో రూ.15 వందల కోట్లు మంజూరు చేశారన్నారు. వాటిని దేని కోసం ఖర్చుచేశారో ఇప్పటి వరకు సీఎం కేసీఆర్​ చెప్పలేదన్నారు. ఇంతవరకు పేదలకు డబుల్​బెడ్​రూం రాలేదని, ఇంటికో ఉద్యోగం దక్కలేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రపై టీఆర్ఎర్ గుండాలు ఓర్వలేక దాడులు చేశారేని.. వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టామని హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా పోడు భూములకు పట్టాలిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్​ఎనిమిదేళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు, రైతులు నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని ఆయన కార్యకర్తలను కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూ. లక్ష రుణమాఫీ, మారుముల గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు అజ్మీర హరినాయక్, గోలి చందు, రాజశేఖర్, జక్కుల సురేశ్, తిరుపతి, బీజేవైఎం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్, మహిళ మోర్చా అధ్యక్షురాలు సుగుణ తదితరులు పాల్గొన్నారు.

కడెంపై సర్కార్ నిర్లక్ష్యం

కడెం ప్రాజెక్టుపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ ఆరోపించారు. మండల కేంద్రంలో రైతు సంఘాల లీడర్లు ప్రాజెక్టుకు రిపేర్లు చేయించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందించారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలేదన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చొరవ తీసుకోవడం లేదని విమర్శించారు. 

వజ్రోత్సవ పోటీలు ప్రారంభం

ఆదిలాబాద్,వెలుగు: వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగురామన్న క్రీడాపోటీలు ప్రారంభించారు. విజేతలకు ఈనెల 18న బహుమతులు అందజేస్తామన్నారు. అంతకు ముందు కలెక్టర్, ఎమ్మెల్యే కొద్దిసేపు హాకీ, వాలీబాల్​ఆడారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఆర్డీవో రమేశ్​రాథోడ్, మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్​జహీర్ రంజాని, స్పోర్ట్స్​ఆఫీసర్​వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శైలజ, ఒలింపిక్​అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, పీఈటీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

ఆడపడుచులకు అండగా  కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ 

ఖానాపూర్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే రేఖానాయక్ చెప్పారు. ఆయా గ్రామాల లబ్ధిదారులకు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్​ఫండ్​చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఎంపీపీ మొహీద్, వైస్ ఎంపీపీ వాల్ సింగ్, తహసీల్దార్ రాజమోహన్, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో చేరిక

దండేపల్లి, వెలుగు: ఎన్​ఎస్​యూఐ లక్సెట్టిపేట మండల మాజీ అధ్యక్షుడు ఎంబడి శ్రీనివాస్ మంగళవారం బీజేపీలో చేరారు. లక్సెట్టిపేట పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరమల్ల హరగోపాల్​రావు, ఎనగందుల లక్ష్మణ్​ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు సమక్షంలో కాషాక కండువా కప్పుకున్నారు. ప్రధానమంత్రి నరెంద్రమోడీ పరిపాలన దక్షత దేశానికి అవసరమని భావించి బీజేపీలో చేరుతున్నట్టు శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కోశాధికారి గుండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.  

ఆశ్రమ స్కూల్​ను తనిఖీ చేసిన డీటీడీవో 

చెన్నూర్​, వెలుగు: కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోని గిరిజన ఆశ్రమ స్కూళ్లను డీటీడీవో నీలిమ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని ఆదేశించారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్​​లో స్పెషల్​ క్లాస్​లు నిర్వహించాలన్నారు. టెన్త్​లో వంద శాతం రిజల్ట్​ సాధించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. ఏటీడీవో చిరంజీవి, స్పోర్ట్స్ ఆఫీసర్ జీవరత్నం, స్పెషల్ ఆఫీసర్ శంకర్​ పాల్గొన్నారు. 

నిర్మల్​ టీఆర్ఎస్​లో అసమ్మతి స్వరం

దుమారం రేపుతున్న  బాసర జడ్పీటీసీ వ్యాఖ్యలు

నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లా అధికార టీఆర్ఎస్​పార్టీలో అసంతృప్తి జ్వాల రగులుకుంది. పార్టీలో కొనసాగుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు, లీడర్లు తమ నేతల తీరుపట్ల బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. చాలా రోజుల నుంచి అసంతృప్తితో ఉన్న సీనియర్లు కొందరు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తీరుకు నిరసనగా బాసర జడ్పీటీసీ వసంత రమేశ్​చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఎమ్మెల్యే అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, గడ్డెన్న ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్య పరిష్కరించలేదని ఆరోపించారు. జడ్పీటీసీ వసంత భర్త రమేశ్​20  ఏళ్ల నుంచి క్రీయాశీలక రాజకీయాల్లో ఉన్నారు. మాజీ మంత్రి, దివంగత గడ్డెన్నకు సన్నిహితుడిగా కొనసాగారు. ఆయన భార్య వసంత కుభీర్ జడ్పీటీసీగా పనిచేశారు. ప్రస్తుతం బాసర జట్పీటీసీగా కొనసాగుతున్నారు. ఇది ఇలాఉంటే నియోజకవర్గంలో మరికొంత మంది ప్రజాప్రతినిధులు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖానాపూర్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.

గవర్నర్ నుంచి అవార్డు అందుకున్న తిరుపతమ్మ

ఆసిఫాబాద్,వెలుగు: ఆజాదీకా అమృత్​మహోత్సవంలో భాగంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మండలంలోని జెండాగూడ గ్రామానికి చెందిన తిరుపతమ్మ ప్రతిభ కనబరిచారు. సోమవారం రాజ్​భవన్​లో గవర్నర్​తమిళిసై ఆమెకు అవార్డు అందజేశారు.

వాజ్‌‌పేయి వర్ధంతి 

ఆదిలాబాద్, వెలుగు: బీజేపీ జిల్లా ఆఫీస్​లో మంగళవారం మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్​పేయి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, లీడర్లు లాలా మున్నా, లోక ప్రవీణ్ రెడ్డి, ఆకుల ప్రవీణ్, సుహాసిని రెడ్డి, జోగు రవి, దశరథ్, దినేశ్​మాటోలియా, కృష్ణ యాదవ్, రాజేశ్, మహేందర్, నగేశ్​ పాల్గొన్నారు.

తేనె శుద్ధి, సబ్బుల తయారీతో ఉపాధి

నిర్మల్,వెలుగు: తేనె శుద్ధి, సబ్బుల తయారీతో గిరిజనులకు ఉపాధి దొరుకుతుందని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నిర్మల్​లోని ​తేనె శుద్ధి ఫ్యాక్టరీని పరిశీలించారు. తయారీ విధానం, పరికరాల నాణ్యత తెలుసుకున్నారు. అనంతరం ట్రైబల్​ వెల్ఫేర్ ​స్కూల్​లో తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సీజనల్​వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీజీఎం విజయ్ కుమార్, ఈఈ భీంరావు, ఈపీడీవో శ్రీనివాస్​ రెడ్డి తదితరులున్నారు. 

యాత్రపై దాడి చేయడం అమానుషం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ లీడర్లు దాడికి పాల్పడడం అమానుషమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పి. రమాదేవి పేర్కొన్నారు. మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఖానాపూర్​లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని సంతోష్ మాట్లాడారు. బీజేపీ ఎదుగుదలను కేసీఆర్ ఓర్వలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్​ రెడ్డి,  లీడర్లు అయ్యన్న గారి భూమయ్య, అలివెలు మంగ, శ్రావణ్​ రెడ్డి, ఆడెపు సుధాకర్, వెంకటేశ్, శ్రవణ్, అల్లం భాస్కర్, భరత్, శివానంద, రాము,మోహన్, మల్లయ్య, రవీందర్ రెడ్డి, రాజేశ్వర్, శ్రీనివాస్, పరమేశ్వర్, భూమన్న, భూమాగౌడ్  తదితరులు పాల్గొన్నారు.

- నిర్మల్/ఖానాపూర్, వెలుగు