రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి .. బీజేపీ నేతలకు హైకమాండ్​ దిశానిర్దేశం

రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి .. బీజేపీ నేతలకు హైకమాండ్​ దిశానిర్దేశం

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. కేంద్ర పథకాలతో పాటు పదేండ్ల బీజేపీ పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించింది. ఢిల్లీలోని దీన్ దయాల్ మార్గ్ లోని బీజేపీ హెడ్ ఆఫీసులో జరిగిన రెండు రోజుల నేషనల్ బేరర్స్ మీటింగ్ శనివారం ముగిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు తొలిరోజు ప్రధాని మోదీ, రెండో రోజు కేంద్ర హోంమంత్రి, పార్టీ అగ్రనేత అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశాలు సాగాయి. సమావేశాల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి,  డీకే అరుణ, డా.లక్ష్మణ్,  బండి సంజయ్, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలపై సమావేశాల్లో చర్చించారు. తెలంగాణలో బీజేపీకి పెరిగిన ఓటు శాతం, అభ్యర్థుల విజయాలపై రిపోర్టును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమర్పించినట్లు తెలిసింది. లోక్ సభ ఎన్నికల్లోనూ తెలంగాణ నుంచి మంచి ఫలితాలు వచ్చేలా మరింత కష్ట పడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని నేతలకు పార్టీ అధిష్టానం సూచించింది. కాగా, పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలపరచడానికి వివిధ సంస్థాగత విషయాలపై రెండు రోజుల నేషనల్ బేరర్స్ మీటింగ్ లో చర్చించినట్లు బీజేపీ సీనియర్​ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు.