న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ శనివారం కీలక భేటీ నిర్వహించింది. ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో జరిగిన ఈ భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. దాదాపు గంటకుపైగా సాగిన ఈ మీటింగ్ లో.. తెలంగాణతోపాటు త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై చర్చించారు.
అలాగే త్వరలో మూడు రాష్ట్రాల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు, దేశవ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర కేబినేట్లో మార్పులు, చేర్పులు, ఎన్నికలు జరిగే స్టేట్స్ లో చేపట్టాల్సిన కూర్పులపై డిస్కస్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా ఇటీవల మోర్చాల వారీగా ఇచ్చిన రిపోర్ట్ లు, ఆయా రాష్ట్రాల నుంచి పార్టీ సంస్థాగత ఇంచార్జ్ లు సమర్పించిన పలు నివేదికలపై హైకమాండ్ సుదీర్ఘంగా చర్చించింది. త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
రాజ్యసభకు రాష్ట్రం నుంచి ఒకరు..
త్వరలో గుజరాత్ (3), బెంగాల్ (6), గోవా (1) రాష్ట్రాల్లో కలిపి మొత్తం 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు గడువు జులై 13తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం దాదాపు 5 సీట్లు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే సాధ్యమైనంత వరకు మరో రెండు సీట్లను అదనంగా గెలుచుకోవడం, ఆ దిశలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ముఖ్యంగా ఇందులో తెలంగాణ నుంచి ఒక లీడర్ కు అవకాశం కల్పించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం కేబినెట్ విస్తరణలోనూ ఆ లీడర్కు చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
