బీసీ కార్డుతో జనంలోకి బీజేపీ.. పార్టీ స్టేట్ ఆఫీసులో ఎన్నికల నిర్వహణ కమిటీ నిర్ణయం

బీసీ కార్డుతో జనంలోకి బీజేపీ.. పార్టీ స్టేట్ ఆఫీసులో ఎన్నికల నిర్వహణ కమిటీ నిర్ణయం
  • బీసీ కార్డుతో జనంలోకి బీజేపీ
  • పార్టీ స్టేట్ ఆఫీసులో ఎన్నికల నిర్వహణ కమిటీ నిర్ణయం
  • ఈ నెలాఖరులో పరేడ్ గ్రౌండ్​లో బీసీ సభకు ప్లాన్

హైదరాబాద్, వెలుగు : బీసీ కార్డుతోనే ఎన్నికల ప్రచారంలోకి వెళ్లాలని బీజేపీ భావిస్తున్నది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ స్టేట్ ఆఫీసులో జరిగిన ఎన్నికల నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకున్నది. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో తీరని అన్యాయం చేస్తోందని, కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా ఇస్తున్న ప్రాధాన్యతను ఇంటింటికీ వివరించాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రంలోని బీసీలకు బీజేపీ అండగా నిలుస్తుందనే సంకేతాలను తెలంగాణ సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెలాఖరులో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీనికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని రాష్ట్ర పార్టీ భావిస్తోంది. 

బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ సభపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాగైనా సరే మోదీని ఈ సభకు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించి బీజేపీ.. బీసీల మద్దతు పొందే ప్రయత్నంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. టికెట్ల విషయంలో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల కన్నా.. తామే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ హైకమాండ్​ఉన్నది. ఆ దిశగా కసరత్తు కూడా చేస్తున్నది.