బైపోల్ నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా హుజురాబాద్ బాద్ లో ప్రచారం స్పీడప్ చేయాలని భావిస్తోంది బీజేపీ. ఈటల గెలుపే లక్ష్యంగా పార్టీ ముఖ్య నేతలంతా నియోజకవర్గాన్ని చుట్టేసేలా ప్లాన్ చేస్తోంది. సీఎం దళితబంధు ప్రారంభోత్సవ సభ తర్వాత కూడా ఈటల రాజేందర్ పై ప్రజల్లో సానుభూతి తగ్గలేదని సీఎంకు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో 12 రోజులు పాదయాత్ర చేశారు ఈటల రాజేందర్. అనుకోకుండా అస్వస్థతకు గురికావడంతో పాదయాత్ర నిలిచిపోయినా.. ఇప్పటికీ రోజూ ప్రజల మధ్యకు వెళ్తూ ప్రచచారాన్ని సాగిస్తున్నారు. ప్రచారాన్ని మరింత స్పీడప్ చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మండలాలు, బూతుల వారిగా కమిటీలు నియమించింది. సీఎం సభ తర్వాత ఈటలపై ప్రజల్లో సానుకూలత వస్తుండటంతో.. దీనికి కొనసాగింపుగా బీజేపీ నాయక్వతం రంగంలోకి దిగాలని భావిస్తోంది.
ఈనెల 24 నుంచి బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు రెడీ అవుతున్నారు. తన ప్రసంగాల ద్వారా హుజురాబాద్ ను ఫోకస్ చేసేలా ఆయప్లాన్ చేస్తున్నారు. ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చే సమయానికి బండి సంజయ్ పాదయాత్ర హుజురాబాద్ కు చేరుకునేలా షెడ్యూల్ సెట్ చేస్తున్నారు. తను ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే హుజురాబాద్ కూడా ఉంది. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి హుజురాబాద్ లోనే మకాం వేసి ఈటల విజయం కోసం తన వంతు కృషి చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీనటీ, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ మంత్రి డీకే అరుణలాంటి వాళ్లు కూడా కొద్ది రోజుల్లో ఎన్నికల ప్రచారంలోకి రానున్నారు. చివరి సమయంలో అమిత్ షా కూడా హుజురాబాద్ ప్రచారంలో పాల్గొంటారు.
టీఆర్ఎస్ నాయకత్వం హుజురాబాద్ బైపోల్ ను సవాల్ గా తీసుకుంది.గెలుపు కోసం అన్నీ ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్. ఆగిపోయిన 11 వేల కొత్త ఫించన్లు మంజూరు చేయడంతో పాటు గొర్రెల పంపిణీని వేగవంతం చేశారు. 57 ఏళ్లకే కొత్త ఫించన్లు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. మహిళాసంఘాలకు రుణాల మంజూరు చేశారు. పాతరుణాలకు వడ్డీమాఫీ చేశారు. కులసంఘాలతో పాటు, కీలకమైనవర్గాలన్నింటిని ఆకట్టుకునేలా భవనాలు కట్టిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ది పనులు టీఆర్ఎస్ చేపట్టింది. 20 వేల దళిత కుటుంబాలకు మేలు జరిగేలా దళిత బంధు పైలట్ ప్రాజెక్టును హుజురాబాద్ నుంచే ప్రారంభించారు సీఎం. అయితే తన రాజీనామా వల్లే హుజురాబాద్ లో ఇవన్నీ వస్తున్నాయని ఈటల చెబుతున్నారు. జనం కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు సీఎంకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందించినట్లు తెలుస్తోంది.
ఓ వైపు అభివృద్ధి పనులు, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను స్పీడప్ చేసింది ప్రభుత్వం. స్థానిక నాయకులకు పదవులు కట్టబెట్టింది. హుజురాబాద్ కు చెందిన బండ శ్రీనివాస్ కు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవితోపాటు, కొత్తగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేసింది. పార్టీలో ఉద్యమకారుడుగా, విద్యార్థి నేతగా పేరున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును అధికారికంగా హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు సీఎం. అయితే ఈటల రాజేందర్ కు ప్రజల్లో ఉన్న అభిమానం, ఉద్యమకారుడిగా ఉన్న పేరు, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ నేతలు గెలుపుకోసం ఓట్లు గల్లంతు చేయడం, కొత్త ఓట్లు నమోదు చేయడంతో పాటు పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ చేసే అవకాశం ఉందని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని ఈటల రాజేందర్ అన్ని సమావేశాల్లోనూ పదే పదే చెబుతున్నారు. ఓవైపు ఈటలకు మద్ధతుగా ప్రచారం చేస్తూనే.. మరోవైపు టీఆర్ఎస్ ప్రలోభాలను అడ్డుకోవాలన్న వ్యూహాన్ని బీజేపీ అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈటలకు మద్ధతుగా ఓయూ, కాకతీయ జేఏసీ విద్యార్థి నేతలు, పలు బీసీ, ఎస్సీ కుల సంఘాల ప్రతినిధులు, కళా బృందాలు రంగంలోకి దిగాయి.. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ కమలం గుర్తును పరిచయం చేస్తున్నారు.హుజురాబాద్ లో ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొస్తుందని భావిస్తున్నారు.
