పుస్తక ప్రదర్శనలు.. సామాజిక వికాస వేదికలు

పుస్తక ప్రదర్శనలు.. సామాజిక వికాస వేదికలు

పుస్తక ప్రేమికులకు డిసెంబర్ నెల ఒక పండుగలాంటిది. అక్షరాల సావాసం కోసం, జ్ఞాన సముపార్జన కోసం ఎదురుచూసే పాఠకులకు 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఒక వరంలా మారింది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు పది రోజులపాటు జరగనున్న ఈ మహా క్రతువులో లక్షలాది పుస్తకాలు కొలువుదీరనున్నాయి.  ఎన్టీఆర్​ స్టేడియంలో జరిగే  పుస్తక జాతరలో కేవలం పుస్తకాల అమ్మకాలే కాకుండా,  వాటి ఆవశ్యకత, సమాజంపై వాటి ప్రభావం వంటి అంశాలపై చర్చలు, ఉపన్యాసాలు ఉంటాయి.  కొత్త  పుస్తకాల ఆవిష్కరణలు, సామాజిక సిద్ధాంతాలు, అస్తిత్వ వాదాలు, జీవిత చరిత్రలు, నవలలు, కవిత్వం, పర్యావరణం, ప్రగతిశీల సాహిత్యం, ఆధ్యాత్మిక గ్రంథాలు ఇలా భిన్న కోణాలకు సంబంధించిన పుస్తకాలు వివిధ భాషల్లో పాఠకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద,  అత్యంత ప్రతిష్టాత్మకమైన బుక్ ఎగ్జిబిషన్  ఫ్రాంక్​ఫర్ట్  బుక్ ఫెయిర్.  ఇది జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్  నగరంలో జరుగుతుంది.  సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది.  ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో  నిర్వహించే ఈ ప్రదర్శనలో 100కి పైగా దేశాల నుంచి 7,000కి పైగా ప్రదర్శకులు,  3 లక్షలకు పైగా సందర్శకులు పాల్గొంటారు.  భారతదేశంలో అతిపెద్ద  బుక్ ఎగ్జిబిషన్ న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్.   దీనిని ప్రభుత్వ సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా నిర్వహిస్తుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెలలో  ఢిల్లీలోని ప్రగతి మైదాన్​లో   ఈ ప్రదర్శన 10 రోజుల పాటు జరుగుతుంది.  ఇందులో 30కి పైగా దేశాల నుంచి 1,000 కంటే ఎక్కువ మంది ప్రదర్శకులు,  ఐదు లక్షలకు పైగా సందర్శకులు పాల్గొంటారు.  భారతదేశంలోనే ఇతర పెద్ద బుక్ ఫెయిర్లలో  కోల్​కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్,  జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్,  చెన్నై బుక్ ఫెయిర్ మొదలైనవి ఉన్నాయి.

సాంస్కృతిక  మహోత్సవాలు

పుస్తక ప్రదర్శనలను కేవలం పుస్తకాలు కొనుగోలు చేసే వాణిజ్య కేంద్రాలుగా చూడలేం. ఇవి ఒక జాతి సాంస్కృతిక,  సామాజిక ప్రగతికి అద్దం పట్టే మహోత్సవాలు.  సమాజంలో నైతిక విలువలను, జ్ఞానాన్ని, సాహిత్య అభిరుచిని పెంపొందించడంలో  ఇవి  కీలక పాత్ర పోషిస్తాయి.  ఈ  వేదికలు ఒకే  సమయంలో విద్య, వినోదం, సమాచారాన్ని అందిస్తూ  త్రివేణి  సంగమంగా నిలుస్తాయి.  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌  షాపింగ్‌‌‌‌‌‌‌‌లో పుస్తకాన్ని భౌతికంగా తాకలేం, కానీ ఇక్కడ పేజీలు తిరగేసి, విషయాన్ని పరిశీలించి కొనుగోలు చేసే సౌలభ్యం పాఠకుడికి లభిస్తుంది. అలాగే రచయితలకు, ప్రచురణకర్తలకు పాఠకుల నాడిని అర్థం చేసుకోవడానికి, మార్కెట్ పోకడలను గ్రహించడానికి ఇది అద్భుతమైన అవకాశం. 

అన్ని వర్గాలకు విజ్ఞాన గని

 ఒక పుస్తక ప్రదర్శన లక్షణం అన్ని వయసులవారినీ ఆకట్టుకోవడం. ఇక్కడ చిన్నపిల్లల కోసం రంగురంగుల బొమ్మల పుస్తకాలు, విద్యార్థుల కోసం విజ్ఞానశాస్త్రం, చరిత్ర, కథల పుస్తకాలు, యువత కోసం పోటీ పరీక్షల గైడ్లు, నవలలు, వ్యక్తిత్వ వికాస గ్రంథాలు లభిస్తాయి.  అలాగే వయోజనుల కోసం రాజకీయ, సామాజిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక, హాబీలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. పరిశోధకులకు, అకడమిక్ వర్గాలకు అవసరమైన అరుదైన రిఫరెన్స్ పుస్తకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. అందుకే,  బుక్ ఫెయిర్ అనేది ఏ ఒక్కరికో కాకుండా, మొత్తం కుటుంబం ఉల్లాసంగా గడిపే ఒక విజ్ఞాన విహారయాత్రగా మారుతుంది.  రచయితలతో ముఖాముఖి, ఆటోగ్రాఫ్ సెషన్లు, పుస్తక సమీక్షలు,  చర్చా వేదికలు రచయితకు, పాఠకుడికి మధ్య ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పరుస్తాయి. 

సాహిత్య వికాసం

సాహిత్య రంగానికి ఈ ప్రదర్శనలు వెన్నెముక వంటివి.  ఇవి కొత్త రచనా శైలి, ప్రయోగాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహిస్తాయి. అనువాద సాహిత్యం ద్వారా ఇతర భాషల సంస్కృతి, విజ్ఞానం మనకు చేరువవుతాయి. ముఖ్యంగా చిన్న,  స్వతంత్ర  ప్రచురణ సంస్థలకు తమ పుస్తకాలను పాఠకుల ముందుకు తీసుకురావడానికి ఇదొక గొప్ప వేదిక. పెద్ద సంస్థలతో సమానంగా తమ పుస్తకాలను ప్రదర్శించే అవకాశం లభించడం వల్ల సాహిత్యంలో వైవిధ్యం బతుకుతుంది. పుస్తక ఆవిష్కరణలు, పురస్కార ప్రదానోత్సవాలు సాహిత్యకారులకు గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెడతాయి. పిల్లల్లో చిన్నప్పటి నుండే పుస్తక పఠనం అనే బీజం నాటడానికి పుస్తక ప్రదర్శనలు అత్యంత శక్తిమంతమైన సాధనాలు.  పిల్లలను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దిన స్టాల్స్, కథలు చెప్పే సెషన్లు, చిత్రలేఖనం పోటీలు, పజిల్స్ వంటివి పిల్లలను పుస్తకాల వైపు మళ్లిస్తాయి. పుస్తకం అంటే కేవలం చదువు మాత్రమే కాదు, అది ఒక ఆనందాన్ని పంచే నేస్తం అనే భావనను కలిగిస్తాయి. 

వ్యక్తిత్వవికాసంలో పుస్తకాల పాత్ర కీలకం

 పుస్తక పఠనం  మనిషిని జ్ఞానవంతుడిగా మాత్రమే కాకుండా సంపూర్ణ వ్యక్తిగా మారుస్తుంది.  ఒత్తిడిని తగ్గించి,  మానసిక  ప్రశాంతతను చేకూర్చడంలో పుస్తకాలు  ఔషధంలా పనిచేస్తాయి. నిరంతర పఠనం వల్ల విమర్శనాత్మక ఆలోచన, సహనం, విశాల దృక్పథం అలవడతాయి.  ఒక మంచి పుస్తకం ఒక వ్యక్తి జీవితాన్నే మార్చగలదు.   సమాజంలో  ఇటువంటి ఆరోగ్యకరమైన మార్పును తీసుకురావడానికి పుస్తక ప్రదర్శనలు దోహదపడతాయి. ఈ మధ్య తెలంగాణ ప్రాంతంలో ఛాయా, సమూహ, గ్రంథాలయ వారోత్సవాలు, హైదరాబాద్ బుకింగ్, తరువాత లెటర్ ఫెస్టివల్  అంటే దాదాపు సంవత్సరంలో నాలుగు నెలల పాటు సాహిత్య ఉత్సవాలు, పుస్తకాల పండుగలు. రచయిత పండుగలు జరుగుతున్నాయి.  ఈసారి 38వ బుక్ ఫెయిర్ లో గ్రంథాలయ విభాగానికి ప్రత్యేక స్థానం కల్పించడం శుభపరిణామం. సమాజంలో పుస్తక సంస్కృతిని మరింత బలంగా నాటడానికి ఇది దోహదపడుతుంది.  ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న  మారుమూల జిల్లాల పౌర గ్రంథాలయాలకు లేదా స్వచ్ఛంద గ్రంథాలయాలకు పుస్తకాలు అందించడం ఎంతో అవసరం.  ఇలాంటి సామాజిక దృక్పథంతో కూడిన కార్యక్రమాలు పుస్తక ప్రదర్శనల పరమార్థాన్ని సార్థకం చేస్తాయి.

-డా. రవి కుమార్
 చేగొని, 
కార్యదర్శి, తెలంగాణ
 గ్రంథాలయ సంఘం, 
హైదరాబాద్