'మూవీరూల్జ్' వంటి వెబ్‌సైట్ల అరాచకం కేవలం వినోద రంగ సమస్య కాదు. ఇది దేశ డిజిటల్ సార్వభౌమాధికారానికి విసిరిన బహిరంగ సవాలు. ఈ వైఫల్యం వెనుక లోతైన న్యాయపరమైన చిక్కులు, సాంకేతిక సంక్లిష్టత ఉన్నాయి.
ముందుగా మనం గ్రహించాల్సిన ప్రాథమికాంశం ‘డిజిటల్ సరిహద్దులు’. భారతదేశ చట్టాలు మన భౌగోళిక పరిధిలోని సర్వర్లపై మాత్రమే పూర్తిస్థాయి మూవీరూల్జ్ వంటి పైరసీ కేంద్రాలు తమ సర్వర్లను విదేశాల్లో, ముఖ్యంగా కాపీరైట్ చట్టాలు బలహీనంగా ఉన్న దేశాల్లో లేదా 'డేటా హెవెన్స్' అని పిలిచే ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాయి.
మన దేశంలో ఒక డొమైన్‌ను నిషేధించిన వెంటనే, వారు ప్రాక్సీ లేదా మిర్రర్ సైట్ల ద్వారా కొత్త చిరునామాతో నిమిషాల్లో ప్రత్యక్షమవుతున్నారు. ఈ 'వర్చువల్ మారువేషాలను' గుర్తించి అడ్డుకోవడం ప్రస్తుత అంతర్గత భద్రతా చట్టాలకు అత్యంత క్లిష్టతరమైన అంశం.
అంతర్జాతీయ పరస్పర న్యాయ సహకార ఒప్పందాలు లేనిదే విదేశీగడ్డపై ఉన్న డిజిటల్ నేరగాళ్లను శిక్షించడం అసాధ్యంగా మారుతోంది. మన ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 75 అంతర్జాతీయ నేరాలను ప్రస్తావించినప్పటికీ, ఇతర దేశాల సార్వభౌమాధికార జోక్యం లేకుండా చర్యలు తీసుకోవడం క్లిష్టతరమవుతోంది.
చట్టపరమైన లొసుగులు
సినిమాటోగ్రాఫ్ (సవరణ) చట్టం -2023 ద్వారా పైరసీకి కఠిన శిక్షలు, మూడేళ్ల జైలుశిక్ష, సినిమా నిర్మాణ వ్యయంలో 3శాతం వరకు జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ చట్టం ప్రధానంగా భౌతిక రూపంలో థియేటర్లలో రికార్డింగ్ చేసే వ్యక్తులను పట్టుకోవడానికి పరిమితమవుతోంది.
వికేంద్రీకృత నెట్‌వర్క్ ద్వారా విస్తరిస్తున్న పైరసీ మూలాలను తాకడంలో ఈ నిబంధనలు తడబడుతున్నాయి. క్లౌడ్ స్టోరేజ్, టెలిగ్రామ్ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సాగే కంటెంట్ పంపిణీని ఈ చట్టం సమర్థవంతంగా నియంత్రించలేకపోతోంది. ఐటీ చట్టం కింద ఉన్న 'సేఫ్ హార్బర్' నిబంధనలను అడ్డం పెట్టుకుని అనేక వెబ్‌సైట్లు తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయి.
రివర్స్ ప్రాక్సీ
ఈ అక్రమ కార్యకలాపాలు కేవలం ఒక సర్వర్‌కు పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయి వికేంద్రీకృత నెట్‌వర్క్ వ్యవస్థపై ఆధారపడుతున్నాయి. మూవీరూల్జ్ వంటి సైట్లు తమ అసలు ఐపీ చిరునామాను దాచడానికి 'రివర్స్ ప్రాక్సీ' సాంకేతికతను వాడుతున్నాయి.
క్లౌడ్‌ఫ్లేర్ వంటి కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్‌ల ముసుగులో ఇవి పని చేస్తాయి. దీనివల్ల ప్రభుత్వ సంస్థలు ఒక డొమైన్‌ను బ్లాక్ చేసినా, వెనుక ఉన్న అసలు సర్వర్ సురక్షితంగా ఉంటుంది. వీరు వాడే 'డొమైన్ హోపింగ్' పద్ధతి ద్వారా నిరంతరం చిరునామాలను మారుస్తూ డిజిటల్ నిఘా విభాగాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సర్వర్ లొకేషన్ మార్చడం, ఎన్-క్రిప్టెడ్ డేటా ప్యాకెట్స్ పంపడం ద్వారా ఇవి చట్టబద్ధమైన డేటా సెంటర్ల ముసుగులో చెలామణి అవుతున్నాయి.
డీఎన్ఎస్ హైజాకింగ్
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు డీఎన్ఎస్ బ్లాకింగ్ చేపడుతున్నారు. అయితే పైరసీదారులు ప్రత్యామ్నాయ డీఎన్ఎస్ సర్వర్ల ద్వారా లేదా వీపీఎన్ సాంకేతికత ద్వారా ఈ ఆంక్షలను సులభంగా అధిగమిస్తున్నారు. వీరు సృష్టించే మిర్రర్ సైట్లు అసలు వెబ్‌సైట్ ప్రతిరూపాలుగా ఉండి నిరంతర సింక్రనైజేషన్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాయి. ఫలితంగా ఒక డొమైన్ నిలుపుదల చేసినా, అదే కంటెంట్ వందలాది కొత్త చిరునామాలతో ప్రత్యక్షమవుతోంది. అంతర్జాతీయ వెబ్ రిజిస్ట్రార్ల స్థాయిలోనే ఈ అక్రమ డొమైన్లను రద్దు చేసేలా జవాబుదారీతనం పెంపొందించడం అత్యవసరం.
పీ2పీ నెట్‌వర్క్
పైరసీ కంటెంట్ పంపిణీలో పీర్-టు-పీర్ ప్రొటోకాల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. టోరెంట్ వంటి సాంకేతికత ద్వారా ఒకే ఫైల్‌ను వేలాదిమంది వినియోగదారుల కంప్యూటర్ల నుంచి ముక్కలు ముక్కలుగా డౌన్‌లోడ్ చేసే వీలుంటుంది.
ఒక నిర్దిష్ట కేంద్ర సర్వర్ అంటూ ఉండదు. కాబట్టి, దీన్ని పూర్తిగా ఆపడం సాంకేతికంగా అసాధ్యం. అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ వాడటం వల్ల డేటా ట్రాఫిక్‌ను విశ్లేషించడం ఐఎస్పీలకు సవాలుగా మారింది. ‘సీడర్స్’, ‘లీచర్స్’ ద్వారా సాగే ఈ పంపిణీ వ్యవస్థను కట్టడి చేయడానికి ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ నియంత్రణ వ్యవస్థలు ఏకమవ్వాలి.
న్యాయస్థానాలు డైనమిక్ ఇంజంక్షన్లు జారీ చేసినప్పటికీ, వాటి అమలులో 'లేటెన్సీ' సమస్య తలెత్తుతోంది. పైరసీ లింకును గుర్తించి, రిపోర్ట్ చేసి, ఐఎస్పీలు దాన్ని బ్లాక్ చేసేలోపే వేలాది టెరాబైట్ల డేటా వినియోగదారులకు చేరుతోంది.
పైరసీదారుల కొత్త అస్త్రం
మూవీ కంటెంట్‌ను స్లైసింగ్ చేయడం, వాటర్‌మార్క్‌లను తొలగించడం వంటి పనులను ఏఐ ప్రోగ్రామ్స్ ద్వారా సులభతరం చేస్తున్నారు. చట్టబద్ధమైన స్ట్రీమింగ్ సర్వీసుల కోడ్ లాజిక్‌ను అర్థం చేసుకుని, వాటి భద్రతా వలయాలను విచ్ఛిన్నం చేయడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తోంది.
టెక్నాలజీతోనే సమాధానం
పైరసీని అడ్డుకోవడానికి 'బ్లాక్‌చైన్' ఆధారిత కంటెంట్ ట్రాకింగ్, 'డిజిటల్ వాటర్ మార్కింగ్' వంటి అత్యాధునిక సాంకేతికతలను చిత్ర పరిశ్రమ వాడాలి. అక్రమ రికార్డింగ్ జరిగిన మూలాన్ని క్షణాల్లో గుర్తించే ఫోరెన్సిక్ వాటర్ మార్కింగ్ వ్యవస్థను థియేటర్ల స్థాయిలో అమలు చేయాలి. ఈ సాంకేతికత ద్వారా అపరాధిని గుర్తించడం సులభతరమవుతుంది. అదేవిధంగా, సెర్చ్ ఇంజన్ దిగ్గజాలు తమ అల్గారిథమ్స్ ద్వారా పైరసీ లింకులను అప్రమేయంగా అణచివేసే వ్యవస్థను రూపొందించాలి.
-- కట్కూరి శ్రీనివాస్,సైబర్ సెక్యూరిటీ, న్యాయ నిపుణుడు-
