దేశ పాలనలో ఒక ప్రమాదకరమైనతత్వం బలపడిపోయింది. అధికారానికి సంబంధించిన ఖాళీలు అత్యవసరం. ప్రజల జీవితాలకు సంబంధించిన ఖాళీలు ద్వితీయమైనవి. ఒక ప్రజా ప్రతినిధి మరణించినా లేదా రాజీనామా చేసినా, రాజ్యాంగపరంగా ఆరు నెలలలోపే ఆ స్థానాన్ని భర్తీ చేయాలి. పాలకులు దీనిని ప్రజాస్వామ్య రక్షణగా ప్రకటిస్తారు.
కానీ, అదే ప్రజాస్వామ్యానికి మూలాధారం అయిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో-అధ్యాపకుల ఖాళీలు సంవత్సరాల తరబడి ఎందుకు భర్తీ కావు? గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది లేరు, ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు, కోర్టుల్లో న్యాయ సహాయకులు లేరు. ఇది కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కాదు.. ప్రజాస్వామ్య విలువల పతనం.
ప్రభుత్వాలు జీడీపీ గురించి గొప్పగా మాట్లాడతాయి. కానీ, జీడీపీ అనేది పాలకుల సంపద కాదు, కార్పొరేట్ లాభాల మొత్తం కాదు. అది ప్రజల ఉత్పాదక శక్తి ప్రతిబింబం. ప్రజలకు ఉపాధి లేకుండా, కొనుగోలు శక్తి లేకుండా, కుటుంబ ఆర్థిక భద్రత లేకుండా ఏ దేశమైనా నిజంగా అభివృద్ధి చెందలేదు.
దేశ ఆర్థికవ్యవస్థకు అసలైన పునాది చేతివృత్తులు, వ్యవసాయం, సేవారంగం. నేడు గ్రామీణ వ్యవసాయం కుంగితే పట్టణ మార్కెట్ కుంగుతుంది. చిన్న పరిశ్రమలు కూలితే ఉపాధి వ్యవస్థ కూలిపోతుంది. ఈ మౌలిక రంగాలు బలపడకపోతే జీడీపీ సంఖ్యలు పెరిగినా ప్రజల జీవితం దిగజారుతూనే ఉంటుంది.
పాలకుల నిర్లక్ష్యం
ఈ పరిస్థితుల మధ్య దేశం, ముఖ్యంగా రాష్ట్రాలు వేలసంఖ్యలో ఉద్యోగ ఖాళీలతో నిలబడి ఉన్నాయి. ఈ ఖాళీలు పరిపాలనా లోపాన్ని మాత్రమే కాకుండా, పాలకుల నిర్లక్ష్యాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి.
ఉదాహరణకు మన రాష్ట్రంలోనే 56,740 పైగా ప్రభుత్వ పోస్టులు ఖాళీలుగా ఉండగా, మొదటి దశలో 18,236 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో గత సంవత్సరాల్లో 61,379 పోస్టులను భర్తీ చేశామని ప్రకటించారు. కానీ, ప్రకటించిన లక్ష ఉద్యోగాల లక్ష్యానికి ఇంకా చాలాదూరం ఉంది. మరోవైపు విశ్వవిద్యాలయాల్లో సుమారు 3,000 టీచర్, నాన్-టీచర్ ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి.
కేంద్ర స్థాయిలో కూడా 2025లో ఎస్‌ఎస్సీ, సీహెచ్‌ఎస్‌ఎల్ ద్వారా కేవలం 3,131 పోస్టులకే నోటిఫికేషన్ రావడం, సమస్య ఎంత లోతుగా ఉందో చెప్పే స్పష్టమైన సంకేతం ఇది. ఈ ఖాళీల ప్రభావం నిరుద్యోగ యువతపై మాత్రమే కాదు ప్రభుత్వ సేవలలో నాణ్యతపైన, ప్రజల జీవన ప్రమాణంపైన నేరుగా పడుతోంది. అదే సమయంలో ప్రభుత్వం ‘ఇంతమంది ఉద్యోగాలు భర్తీ చేశాం’ అని ప్రకటిస్తున్న సంఖ్యల్లో కూడా ఒక దాచిన వాస్తవం ఉంది.
గతంలో వివిధ శాఖల్లో నియమితులైన అనేకమంది అభ్యర్థులు, తరువాత తమకు నచ్చిన శాఖలలో సంబంధిత ఉద్యోగాలను మరోసారి పరీక్షలు రాసి సాధించడంతో, మొదటపొందిన ఉద్యోగాలను వదిలి వెళ్లిపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వం భర్తీ చేశామని చెప్పిన పోస్టులే తిరిగి ఖాళీలుగా మారుతున్నాయి. ఈ నిజాన్ని లెక్కలోకి తీసుకోకుండా కేవలం సంఖ్యలు చూపించడం వాస్తవ నిరుద్యోగ సమస్యను కప్పిపుచ్చడమే అవుతోంది.
పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం
ఇప్పటి పాలనావిధానంలో ‘పబ్లిక్, - ప్రైవేట్ భాగస్వామ్యం’ అనే పదం విపరీతంగా ప్రచారం పొందుతోంది. వాస్తవానికి ఇది పాలకులు తమ మౌలిక బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వేసుకున్న ఒక సౌకర్యవంతమైన ముసుగు మాత్రమే. ప్రజల విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక అవసరాలను మార్కెట్ చేతుల్లోకి నెట్టివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య. ప్రభుత్వం తన కర్తవ్యాన్ని వదిలేసిన క్షణమే ప్రజాస్వామ్యం నిర్వీర్యమవుతుంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ విషయంలో పాలకులు చూపే అత్యవసరత విద్యారంగంలో మాత్రం కనిపించదు.
సమాజ భద్రత, నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ అవసరమే. ముఖ్యంగా తెలంగాణలో సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. అందుకు తగిన మానవ వనరులు అవసరం. కానీ, ఇక్కడ అసలు ప్రశ్న వేరే.
ప్రైవేట్ పాఠశాలలో సగటున 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటే, ప్రభుత్వ పాఠశాలలో ఆ స్థాయిలో కూడా ఉపాధ్యాయ నియామకాలు ఎందుకు జరగడం లేదు? ప్రభుత్వం ప్రకటించే డీఎస్సీ భర్తీలు ఈ వాస్తవ అవసరానికి అసలు సరిపోవడం లేదు. అంతేకాదు, భారీ స్థాయిలో జరిగే పోలీస్ నియామకాలను పాలకులు నిరుద్యోగ యువతను ప్రజలపైనే పర్యవేక్షణ సాధనంగా ఉపయోగించుకుంటున్న రాజకీయ సంస్కృతి ప్రమాదకరమైన సంకేతం.
ఉద్యోగాల భర్తీ.. ప్రజాస్వామ్యపు నైతిక కర్తవ్యం
విద్యా వ్యవస్థ విషయానికి వస్తే, అనేక కమిషన్‌లు ఉదాహరణగా.. కొఠారి కమిషన్ స్పష్టంగా సూచించిన ప్రకారం ఒక తరగతి గదిలో 30 మంది విద్యార్థులే ఉండాలి. ఈ ప్రమాణాన్ని ఏ పాలకవర్గం కూడా నిజాయితీగా అమలు చేయలేదు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు గిడుగు గదులుగా మారాయి. ఉపాధ్యాయులు బోధనా భారం కింద నలిగిపోతున్నారు.
విద్యార్థుల భవిష్యత్తు తాకట్టు పడుతోంది. ఇది కేవలం పరిపాలనా లోపం కాదు. ఇది దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, భావజాలాల అభివృద్ధిపై పడిన లోతైన దెబ్బ. ఈ పరిస్థితుల మధ్య ప్రభుత్వాలు ‘లక్షల ఉద్యోగాలు’, కోట్ల ఉద్యోగాలు’ అంటూ నినాదాలు చేస్తుంటే, వాస్తవంలో డిగ్రీ పాసులు కోట్ల సంఖ్యలో నిరుద్యోగులుగా మారుతున్నారు. డిగ్రీ ఇప్పుడు జ్ఞానానికి గుర్తుకాదు, నిరుద్యోగానికి సర్టిఫికెట్‌గా మారిపోయింది.
అస్థిర ఉపాధిపై నిలబడిన ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ స్థిరంగా ఎదగదు. ఈ దేశానికి కావల్సింది కొత్త నినాదాలు, హామీలు కాదు ఒక స్పష్టమైన రాజకీయ నిర్ణయం. ఉద్యోగాల భర్తీ జాతీయ బాధ్యత. అది ఎన్నికల అంశం కాదు, ప్రజాస్వామ్యపు నైతిక కర్తవ్యం. పాఠశాలల్లో టీచర్లు, ఆసుపత్రుల్లో డాక్టర్లు, గ్రామాల్లో ప్రభుత్వ సిబ్బంది, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు లేకుండా దేశం జీడీపీ పెరుగుతుందనుకోవడం ఒక భ్రమ మాత్రమే.
చివరగా, రాజకీయ ఖాళీల భర్తీ ద్వారా ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకుంటుంది. ఉద్యోగాల ఖాళీల భర్తీ ద్వారా దేశం తన భవిష్యత్తును కాపాడుకుంటుంది. ఈ రెండింటిలో ఏది ముఖ్యమో ఈ పాలకవ్యవస్థ నిర్ణయించాలి. ఇది పరిపాలనా సమస్య కాదు. ఇది పాలకుల రాజకీయ సంకల్ప పరీక్ష.
పాపని నాగరాజు
