
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు ఇటీవల ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలను రంగంలోకి దింపిన బీజేపీ హైకమాండ్.. ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. మూడు నియోజకవర్గాలకు ఒకరి చొప్పున ముగ్గురు ఇన్చార్జులను నియమించింది. గోవా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ షెట్ కు సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది.
కర్నాటక రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి రాజేశ్‌కు చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలు, ఏపీకి చెందిన సీనియర్ నేత, ఆ పార్టీ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ మధుకర్ కు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలు ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ బాధ్యతలు అప్పగించింది.
మిగతా ఎనిమిది నియోజకవర్గాలకు కర్నాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్సీ, అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా, సదానంద్ షెట్ మంగళవారం పార్టీ స్టేట్ ఆఫీసుకు చేరుకొని.. సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వీటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు, బూత్ కమిటీల నియామకంపై ఆరా తీశారు.
రాజేశ్ బుధవారం తనకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వీరు ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్‌పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని తెలుసుకోనున్నారు. నాయకుల పనితీరు, రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలిచేందుకు ఎలాంటి ప్రోగ్రామ్ లు చేపట్టాలనే దానిపై సమగ్ర నివేదిక తయారు చేసి హైకమాండ్ కు అందించనున్నారు.