
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. రాహుల్ పాదయాత్రలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ప్రధాని మోడీ, ఆయన తల్లిపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. కాంగ్రెస్ కార్యకర్త వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం (ఆగస్ట్ 29) రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది.
ఈ క్రమంలోనే పాట్నా కాంగ్రెస్ కార్యాలయం దగ్గర బీజేపీ కార్యకర్తలు చేపట్టిన నిరసన తీవ్ర హింసాత్మకంగా మారింది. బీజేపీ నిరసనను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పార్టీ జెండా కర్రలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటనపై బీజేపీ నాయకుడు నితిన్ నబిన్ మాట్లాడారు. ఒక తల్లిని అవమానించినందుకు బీహార్‌లోని ప్రతి బిడ్డ కాంగ్రెస్‌కు తగిన సమాధానం ఇస్తాడని అన్నారు. ప్రధాని మోడీ, ఆయన తల్లిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అధికార కూటమి ప్రమేయంతోనే కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి జరిగిందని కాంగ్రెస్ నేత డాక్టర్ అశుతోష్ ఆరోపించారు. దీనికి తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయిస్తూ సీఎం నితీష్ కుమార్ తప్పు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ప్రధాని మోడీ, ఆయన తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నారు. మోడీ, ఆయన తల్లిని దూషించిన వ్యక్తితో పాటు రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్యకర్తలు. బీజేపీ ఫిర్యాదు మేరకు మోడీని దూషించిన వ్యక్తితో పాటు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు దర్భాంగ పోలీసులు. ప్రధాని మోడీని దుర్భాషలాడిన వ్యక్తిని శుక్రవారం (ఆగస్ట్ 29) అరెస్టు చేసినట్లు దర్భాంగా పోలీసులు తెలిపారు.
#WATCH | Patna, Bihar: BJP and Congress workers clash as the former staged a protest against the latter in front of the Congress office. pic.twitter.com/p1tt2bytzD
— ANI (@ANI) August 29, 2025