హస్తం నేతలే టార్గెట్గా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

హస్తం నేతలే టార్గెట్గా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలపై నజర్ పెట్టింది కాషాయ పార్టీ. గ్రౌండ్ లెవల్ లో పార్టీ బలోపేతం కోసం హస్తం నేతలను ఆకర్షించే పనిలో పడింది. ఇప్పటికే చాలామంది నేతలు కమలం గూటికి చేరారు. మరికొందరి బలమైన నేతలపై ఫోకస్ పెట్టింది. బిజెపి ఆకర్ష్ కు హస్తం పార్టీ ఆగమవుతోంది.

కాంగ్రెస్ నేతలపై బిజెపి గురిపెట్టింది. తెలంగాణాలో పట్టు సాధించడానికి హస్తం నేతలనే టార్గెట్ చేసుకొని పనిచేస్తోంది. పార్టీ బలోపేతం కోసం బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే డీకే అరుణ, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, రమేష్ రాథోడ్ లాంటి నేతలతోపాటు మరికొందరిని కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకుంది. 

ఇక మునుగోడు ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ నుండి కాషాయం గూటికి చేరారు.  మునుగోడు ఓటమి కాంగ్రెస్ ను మరింత బలహీన పరిచింది. దీనితో హస్తం పార్టీకి చెందిన మరో ఇద్దరు నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, నిర్మల్ డీసీసీ ప్రెసిడెంట్ రామారావు పటేల్ బీజేపీలో చేరనున్నారు.  

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బలమైన కాంగ్రెస్ నేతలను కాషాయం పార్టీలోకి లాక్కుంది. మరికొందరిని బలమైన హస్తం నేతలపై కూడా గురిపెట్టినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ ఎస్ నుండి వచ్చే వారిని తీసుకోవడంతోపాటు ఎక్కువగా కాంగ్రెస్ నేతలపైనే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. కాషాయం వ్యూహానికి కాంగ్రెస్ పరేషాన్లో పడింది.

బీజేపీకి గ్రౌండ్ లెవల్ లో అంతగా క్యాడర్ లేకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ వున్నా బలమైన నాయకులు లేరు. దీనితో కాంగ్రెస్ నేతలపై కన్నేసింది. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిగా వున్న నేతలు, రేవంత్ వల్ల ఇబ్బంది పడ్తున్న నాయకులను టార్గెట్ చేసి కాషాయం కండువా కప్పే పనిలో పడ్డారు బిజెపి నాయకత్వం. బీజేపీ ఎక్కువగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలను టార్గెట్ చేసి పనిచేస్తున్నట్లు హస్తంపార్టీలో చర్చించుకుంటున్నారు. 2018 ఎన్నికల తర్వాత టీఆరెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ.. 2023 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజేపి ఆపరేషన్ ఆకర్ష్ కు పరేషాన్ లో పడింది. హస్తం పార్టీలో నేతలమధ్య విభేదాలు బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ కు బాగా కలిసొస్తుందని హస్తం నేతలే అనుకుంటున్నారు. మరి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కమలం ఆపరేషన్ ఆకర్ష్ ను ఏ విదంగా కట్టడి చేస్తారో చూడాలి.