హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ రెచ్చగొట్టే కామెంట్లు చేయడం వల్లే 11 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది ఆయన క్రూరత్వానికి పరాకాష్ట అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మండిపడ్డారు. నెల జీతంతో బతికే ఆర్టీసీ కార్మికులపై సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ ప్రతాపం చూపడమేంటని, చిన్న కార్మికులపై ఇంత కఠినత్వం ఎవరైనా చూపుతారా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల పాపం కేసీఆర్ కు తప్పక తగులుతుందన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణసాగర్ రావు మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులతో మాట్లాడడానికి కేసీఆర్ కు సీఎం స్థాయి అడ్డం వస్తోందని ఎద్దేవా చేశారు.
జీతం ఇవ్వని సీఎంగా ముద్ర పడ్డ మీరు, ఎందులో గొప్పనో చెప్పాలని డిమాండ్ చేశారు. సమ్మెపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సరైన జవాబు జవాబు చెప్పలేక ముఖం చాటేసిందని, కోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థాయి సీఎం కేసీఆర్ ది అని విమర్శించారు. రవాణా మంత్రిగా ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చానని చెప్పుకుంటున్న కేసీఆర్, సీఎంగా ఆయన స్థాయి పెరిగినా ఆర్టీసీని ఎందుకు నష్టాల్లోకి తీసుకువచ్చారని ప్రశ్నించారు.
