5 కార్పొరేషన్లలోనూ గులాబీ పార్టీ పై చేయి..అడ్డదారిలో గెలిచిన టీఆర్ఎస్

5 కార్పొరేషన్లలోనూ గులాబీ పార్టీ పై చేయి..అడ్డదారిలో గెలిచిన టీఆర్ఎస్

హైదరాబాద్, వెలుగు:

మున్సిపోల్స్​లో తాము పోరాడింది రాజకీయ పార్టీలతో కాదని, టీఆర్ఎస్ ధన మాఫియాతోపాటు ఇసుక, మద్యం, కాంట్రాక్టర్ల మాఫియాతో పోరాడాల్సి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. అధికార పార్టీకి కొమ్ముకాసే పోలీసులతో, ఓడిపోయిన వారిని గెలిపించే అధికారులతో కూడా తాము పోరాడామని చెప్పారు. గెలుపు కోసం టీఆర్​ఎస్​ తొక్కని అడ్డదారి లేదని, చేయని అవినీతి లేదని, పాల్పడని అక్రమాలు లేవని మండిపడ్డారు. శనివారం మున్సిపోల్స్​ రిజల్ట్స్​ వెలువడిన అనంతరం లక్ష్మణ్​ బీజేపీ రాష్ట్ర ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తమకు పోటీయే కాదన్న కేటీఆర్.. ఒక్కసారి సిరిసిల్ల మున్సిపాలిటీకి, నిజామాబాద్ కార్పొరేషన్ కు వెళ్లి చూస్తే బీజేపీ అంటే తెలుస్తుందన్నారు. స్వయంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలోనే  బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకోవడం, 10 మంది ఇండిపెండెంట్లు గెలవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.  ఇంతకాలం పాలించిన వారు సిరిసిల్ల పట్టణాన్ని ఉరిశాలగా మార్చితే తాము సిరిశాలగా మార్చామని చెప్పిన కేటీఆర్.. మరి ఇప్పుడు అక్కడి ఫలితాలు దేనికి అద్దం పట్టినట్లో చెప్పాలని నిలదీశారు.

అడుగడుగునా అక్రమాలు

ఒక్కో వార్డులో గెలుపు కోసం కోటి రూపాయలు, ఒక్కో ఓటుకు రూ. 30 వేల వరకు టీఆర్​ఎస్​ ఖర్చు చేసిందంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఎంతగా బరి తెగించిందో అర్థమవుతుందని లక్ష్మణ్​ ధ్వజమెత్తారు. దేశంలోనే ఇంత ఖరీదైన ఎన్నికలను ఎక్కడ, ఎప్పుడు చూడలేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం నుంచి మొదలుకుంటే వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ లో దొంగ ఓట్లు వేయించుకోవడం, చివరకు కౌంటింగ్ లో ఇన్ వ్యాలిడ్ ఓట్లను వ్యాలిడ్ ఓట్లుగా చూపి అధికారపార్టీ అభ్యర్థులను గెలిపించుకునే వరకు అడుగడుగునా అక్రమాలే జరిగాయని ఆరోపించారు. తాము కేంద్రంలో అధికారంలో ఉన్న సంగతి టీఆర్ఎస్ మరువొద్దని, టీఆర్​ఎస్​ లెక్క తాము అధికారాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటే తెలంగాణలో టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలువదని లక్ష్మణ్ హెచ్చరించారు. ఇప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యులను అడ్డం పెట్టుకొని మేయర్,  చైర్​పర్సన్​ పదవులను గెలుచుకునేందుకు టీఆర్​ఎస్​ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పిన కేటీఆర్.. మరి మేయర్, చైర్​పర్సన్​ పదవులకు డైరెక్ట్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎందుకు భయపడ్డారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ 16 మంది చైర్​పర్సన్​, మేయర్ అభ్యర్థులను ప్రకటించిందని, కాని టీఆర్ఎస్ ఆ సాహసం చేయలేక పోయిందన్నారు. సహకరించకుంటే కొత్త మున్సిపల్ చట్టంతో పదవులు పోతాయంటూ ఇతర పార్టీల విజేతలను బెదిరిస్తూ టీఆర్​ఎస్​ క్యాంపు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ అంతటి క్రమశిక్షణ తప్పిన పార్టీ మరొకటి ఉండదని, ఆ పార్టీ అభ్యర్థులపైనే, అదే పార్టీ నాయకులు రెబల్స్ గా పోటీ చేశారని లక్ష్మణ్ అన్నారు. క్రమశిక్షణారహిత్యానికి పాల్పడిన ఆ పార్టీ సీనియర్ నాయకులపై చర్యలు తీసుకునేందుకు పార్టీ నాయకత్వం ఎందుకు భయపడిందని ఆయన ప్రశ్నించారు. జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్ నేతలు పార్టీకి వ్యతిరేకంగా 16 మందిని గెలిపించుకుంటే ఆయన మద్దతు కోసం కేటీఆర్ పిలవడం, జూపల్లి వెళ్లడం ఏమిటన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ఓ హెచ్చరిక అని పేర్కొన్నారు.