
కేసీఆర్ సర్కార్ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ ఆరోపించారు. పేదల అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వం దిగజారిందన్న లక్ష్మణ్.. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. భూముల విలువ పెంచేందుకే.. ఎయిర్ పోర్టు మెట్రో చేపట్టారని విమర్శించారు.
ఈసీ కేసీఆర్ జేబు సంస్థ కాదు
అసెంబ్లీ రద్దు మాత్రమే కేసీఆర్ చేతిలో ఉందని.. ఎన్నికలు ఎప్పుడు జరపాలనేది ఈసీ నిర్ణయమని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కర్ణాటకతో పాటు.. ఎన్నికలు జరపటానికి ఈసీ కేసీఆర్ జేబు సంస్థ కాదని మండిపడ్డారు. ముందస్తు కాదు.. జమిలీ ఎన్నికలే బీజేపీ విధానమని తెలిపారు. సీఎం కేసీఆర్ తీరుతో తెలంగాణ రాష్ట్రం నష్టపోతోందన్నారు. తెలంగాణ ప్రజల కోసం కేంద్రంతో కేసీఆర్ సఖ్యతగా ఉండాలని సూచించారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, గవర్నర్ ఎవరికీ ప్రోటోకాల్ పాటించని వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు.
కేసీఆర్ తొండి ఆటలు
అక్రమ సంపాదన నిలుపుకోవడానికే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని లక్ష్మణ్ తెలిపారు. కేంద్రం నిధులకు లెక్క పత్రం లేకుండా.. యూసీలు ఇవ్వకుండా కేసీఆర్ తొండి ఆటలు అడుతున్నాడని అన్నారు. కేంద్రాన్ని బద్నాం చెయ్యడమే కేసీఆర్ అజెండా అని వ్యాఖ్యానించారు. మిగులు రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని దుస్థితిని కేసీఆర్ కల్పించాడని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి లేదు.. ఉద్యోగాలు రాలేదని ఫైర్ అయ్యారు. 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మెట్రో అనటం అవాస్తవమని తెలిపారు. మజ్లీస్ కోసమే 16 కిలోమీటర్ల మెట్రో రైలును 32 కిలోమీటర్ల దూరం పెరిగేలా చేశారని ఆరోపించారు. పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చి కేసీఆర్ తెలంగాణ విలువ తీశారని లక్ష్మణ్ మండిపడ్డారు.