ఆర్​అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాంటూ నిరసన దీక్ష 

ఆర్​అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాంటూ నిరసన దీక్ష 
  • టెంట్లు పీకేసిన పోలీసులు..
  • మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ ఫైర్

చండూరు (మర్రిగూడ), వెలుగు: నల్గొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన చర్లగూడెం రిజర్వాయర్ కింద భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆర్​ అండ్​ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రాజెక్టు వద్ద పనులు అడ్డుకున్నారు. అక్కడే చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండా నిర్వాసితులు నిరసన దీక్ష చేపట్టారు. ‘‘మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చినట్లు రూ.20 లక్షల ప్యాకేజీ ఇవ్వాలి. ఇక్కడ ఉండడానికి ఇల్లు ఇస్తే, మేము ఎట్ల బతకాలి. బతుకుదెరువు కోసం హైదరాబాద్ లో పని చేసుకుంటున్నం. మాకు రంగారెడ్డి జిల్లాలో ఇంటి స్థలాలు ఇవ్వాలి” అని వారు డిమాండ్ చేశారు. దీక్ష విషయం తెలిసి అక్కడికి వచ్చిన లోకల్ ఎస్సై సైదాబాబా.. నిర్వాసితులు దీక్ష చేస్తున్న టెంట్లను తొలగించారు. దీంతో పోలీసులకు, నిర్వాసితులకు మధ్య వాగ్వాదం జరిగింది.

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాజెక్టు వద్దకు వెళ్లి.. పోలీసుల దౌర్జన్యంపై ప్రశ్నించారు. నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణారెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. మొత్తం 280 మంది నిర్వాసితులు ఉండగా, ఇంకా 56 మందికి పరిహారం చెల్లించనేలేదని.. ఏడేండ్లుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు మొదలుపెట్టాలన్నారు. తీసివేసిన టెంట్లను వేయించి, నిర్వాసితులతో కలిసి దీక్ష చేశారు. ఇదే రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన కుదాబక్షపల్లి, రాంరెడ్డిపల్లి, లోయపల్లి, అజిలాపురం నిర్వాసితులు కూడా తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరింది. దీక్షకు రాజగోపాల్​ సంఘీభావం తెలిపారు.