బెల్లంపల్లి రూరల్, వెలుగు: అడవుల అభివృద్ధి పేరుతో గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర నేత కొయ్యల ఏమాజీ హెచ్చరించారు. ఆదివారం నెన్నెల మండలంలోని చిత్తాపూర్లో బీజేపీ మండల అధ్యక్షులు అంగలి శేఖర్‌తో కలిసి గిరిజన కుటుంబాలను కలిసి మాట్లాడారు.
చిత్తాపూర్లో 82 మంది గిరిజనుల భూములను అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా గుంజుకుంటున్నారని, గత 30 ఏండ్లుగా ఆ భూములను గిరిజనులు సాగు చేసుకుంటున్నారని చెప్పారు. 20 మంది గిరిజన రైతుల మీద అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుకు పంపడం అన్యాయమన్నారు. పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని, పోడు భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు వారి భూములను లాక్కోవడం విడ్డూరంగా ఉందన్నారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఒడం కమల, ఉప సర్పంచ్ వెంకటేశ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోవర్దన్, శ్రావణ్ కుమార్, నర్సింగ్, యాదగిరి, శ్రీనివాస్ గౌడ్తదితరులు పాల్గొన్నారు.
