తండ్రీకొడుకుల పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడుంది..?

తండ్రీకొడుకుల పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడుంది..?

హైదరాబాద్, వెలుగుటీఆర్ఎస్​ తండ్రీకొడుకుల పార్టీ అని, అందులో సామాజిక న్యాయం ఎక్కడుందని బీజేపీ రాష్ట్ర చీఫ్​ లక్ష్మణ్​ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడటాన్ని సీఎం కేసీఆర్​ తట్టుకోలేకపోతున్నారని, అందుకే అడ్డదారిలో, అక్రమాలతో మున్సిపాలిటీలు దక్కించుకున్నారని ఆరోపించారు. బుధవారం లక్ష్మణ్ తుక్కుగూడ మున్సిపాలిటీలో పర్యటించారు. పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఎక్కువ సీట్లు గెల్చుకున్నందుకు వారిని అభినందించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్  గల్లీ బుద్ధులు చూపారని, వాటిని ఢిల్లీలో ఎండగడతామని కామెంట్​ చేశారు. దొంగ ఓట్లు వేసే స్థాయికి ఎంపీలు దిగజారుతున్నారంటే.. ఈ రాష్ట్ర రాజకీయాలు ఎటు పోతున్నాయోనని పేర్కొన్నారు. ఏపీ కోటా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తుక్కుగూడలో ఓటేసిన వ్యవహారాన్ని బీజేపీ వదిలిపెట్టదని, ఆయనపై క్రిమినల్​ కేసు పెట్టామని, ఈసీకి కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. కేకేను సస్పెండ్ చేసే వరకు పోరాడుతామని, రాజకీయ, న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

నిబంధనలను తుంగలో తొక్కారు

కేకే మొదట బడంగ్ పేట కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియోగా పేరు నమోదు చేసుకున్నారని, తర్వాతిరోజు తుక్కుగూడకు మార్చుకున్నారని లక్ష్మణ్​ చెప్పారు. అది రూల్స్​కు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై గురువారం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. త్వరలో రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును, వీలైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పే వరకు వదిలేది లేదని చెప్పారు.

టీఆర్ఎస్​ పతనం మొదలైంది

తుక్కుగూడ మున్సిపాలిటీలో ప్రజలు బీజేపీకి స్పష్టమైన తీర్పునిచ్చినా.. టీఆర్ఎస్ దొడ్డిదారిన చైర్మన్ పీఠాన్ని దక్కించుకుందని.. ప్రజల తీర్పును అవమానించిందని లక్ష్మణ్​ చెప్పారు. డబ్బు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పతనానికి తుక్కుగూడే నాంది కాబోతున్నదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలోపేతం కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని చెప్పారు. తుక్కుగూడలో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. బీజేపీ అండగా ఉంటుందని, కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని పేర్కొన్నారు. నిజామాబాద్ లో మెజార్టీ బీజేపీ కార్పొరేటర్లు గెలిచినా.. టీఆర్ఎస్​ అక్రమంగా మేయర్ పదవిని దక్కించుకుందని విమర్శించారు. కేసీఆర్ రాచరికపు పాలనను కొనసాగిస్తున్నారని.. టీఆర్ఎస్  తండ్రీకొడుకుల పార్టీ అని, అందులో సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ అందరి పార్టీ అని, ఎవరైనా అధ్యక్షుడు కావొచ్చన్నారు.  సమావేశంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పార్టీ నేత వీరేందర్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.