నీ పదవి ఎవరు పీకెయ్యాలె?

నీ పదవి ఎవరు పీకెయ్యాలె?
  •                కరెంటు బిల్లులు కట్టకపోతే సర్పంచ్​ల పదవులు తీసేస్తవా?
  •                 వేల కోట్ల బాకీలున్న నీకు సీఎంగా కొనసాగే అర్హతేది?.. కేసీఆర్​పై లక్ష్మణ్​ ఫైర్​

‘‘గ్రామ పంచాయతీలు కరెంట్ బిల్లులు కట్టకపోతే సర్పంచ్ లను, గ్రామ కార్యదర్శులను పదవుల నుంచి పీకేస్తానంటున్నవ్​.. మరి ఇవాళ నేను అడుగుతున్న. మీరు అనేక విద్యుత్ సంస్థలకు కరెంట్ బిల్లులు బకాయిపడ్డరు. బిల్లులు కట్టలేకపోయారు. మరి మీ పదవి ఎవరు పీకెయ్యాలె? ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత వహించరా?” అని సీఎం కేసీఆర్​ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్థల నుంచి కరెంటు కొనుగోలు చేసి బాకీలు చెల్లించలేదని అన్నారు.  గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్​ నిర్వాకం వల్ల రాష్ట్రంలో విద్యుత్​ సంస్థలు రూ. 20 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ‘‘విద్యుత్​ సంస్థలకు రూ. 10 వేల కోట్ల బకాయిలు ఉన్న నీకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా? ఇన్నివేల కోట్ల బాకీలు ఉన్నందున ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవిలో ఎలా కొనసాగించాలి? అంటే నీకొక నీతి, సర్పంచ్ కో నీతినా?  నీకో సెపరేట్ రాజ్యాంగమా? అందరికీ భారత రాజ్యాంగమైతే.. నీకు కల్వకుంట్ల రాజ్యాంగమా?” అని సీఎంపై  మండిపడ్డారు. వివిధ సంస్థలకు వేల కోట్ల రూపాయల బిల్లులు ఎగ్గొట్టిన టీఆర్​ఎస్​ సర్కార్​.. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటన్నారు. టక్కు టమార గారడి  విద్యలతో తెలంగాణ ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరని, అంశాలవారీగా అవినీతిని బట్టబయలు చేసి, ప్రజల ముందు దోషిగా నిలబెడుతామని కేసీఆర్​ను హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని విద్యుత్తు సంస్థలు కుప్పకూలిపోయాయని, విద్యుత్​ కోతలు, ట్రిప్పులు మొదలయ్యాయని, పల్లెల్లోకి వెళ్లి రైతులను అడిగితే తెలుస్తుందన్నారు.

రాష్ట్రంలో భారీ విద్యుత్​ స్కామ్‌

ఆంధ్రాలో కన్నా తెలంగాణలోనే భారీ విద్యుత్​ కుంభకోణం జరిగిందని, ఇది బయటకు రాకుండా కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేశారని లక్ష్మణ్ ఆరోపించారు. జాతీయ సోలార్ విధానంలో టెండర్లు పిలిచి పక్కనపెట్టారని, కమీషన్లు రావన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శించారు.  4 రూపాయల 30 పైసలకు యూనిట్ చొప్పున విద్యుత్​ ఇస్తామంటే కాదని, 5 రూపాయల 50 పైసలకు ఇతర విద్యుత్​ ప్రాజెక్టులతో ఒప్పందం చేసుకున్నారని దుయ్యబట్టారు. ఇంత ఎక్కువ ధరకు కరెంట్​ను ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో కేసీఆర్ చెప్పాలని ఆయన  డిమాండ్ చేశారు. నిజాయితీ, విశ్వాసం ఉంటే రాష్ట్రంలోని విద్యుత్​ కొనుగోళ్లు, ఒప్పందాలపై  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్​ విసిరారు.  ఇండియా బుల్స్ అనే విద్యుత్​ ప్రాజెక్టు దేశంలోనే అత్యంత అసమర్థమైన  ప్లాంట్ అని తెలిసి కూడా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని, ఇప్పటి వరకు ఆ సంస్థ ఒక్క యూనిట్ విద్యుత్​ను కూడా అందించలేకపోయిందని విమర్శించారు. కేసీఆర్ నిర్వాకం వల్ల బ్యాంక్ ల పవర్ క్రెడిట్ రేటింగ్ పడిపోయిందన్నారు. రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వకుండా కేంద్రంపై విమర్శలు చేయడం ఏమిటని నిలదీశారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి తమ పార్టీకే ఉందని, అందుకే ఇతర పార్టీలవాళ్లు తమతో వస్తున్నారని, 2023లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని లక్ష్మణ్​ ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యేలు

పటాన్ చెరు, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్, విజయపాల్ రెడ్డి, సదాశివపేట్ మున్సిపల్ మాజీ చైర్మన్ నాగు గౌడ్, వాళ్ల అనుచరులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. గురువారం పార్టీ  రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ ఆధ్వర్యంలో  పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పార్టీలో చేరిన వారు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.