కూటమికి బాధ్యుడు రాహుల్​ గాంధీనే : ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ

కూటమికి బాధ్యుడు రాహుల్​ గాంధీనే : ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ
  • ప్రతిపక్షాల నిరాశ ఆయన మాటల్లో స్పష్టం
  • 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత  కూటమిలోని పార్టీలు గల్లంతే

కోల్​కతా: ప్రతిపక్ష ఇండియా కూటమికి బాధ్యుడు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధేనని, ప్రతిపక్షాల్లోని నిరాశ ఆయన మాటల్లోనే కనిపిస్తున్నదని బీజేపీ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ చురకలంటించారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చేతిలో ఓడిపోయిన తర్వాత కూటమిలోని చాలా పార్టీలు ఎలక్షన్​ కమిషన్​నుంచి గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు.

కేంద్ర సర్కారు ఇటీవల నోటిఫై చేసిన పౌరసత్వ సవరణ చట్టం –2019 (సీఏఏ)తో ఏదో జరిగిపోతుందని భయం వద్దని సూచించారు. ‘సీఏఏతో ముస్లింలుసహా దేశంలోని ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం జరుగదు. దేశంలో మత ఘర్షణలు, గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి’ అని మండిపడ్డారు. బీజేపీ సర్కారు మూడోసారి కూడా నిర్ణయాత్మక విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్​ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమి సరైన నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతున్నదని, దానికి ఓ విధానమంటూ లేదని విమర్శించారు.

అంతర్గత విభేదాలు, వ్యక్తిగత ఆశయాలు కూటమికి ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపారు. ఇండియా కూటమికి బీజేపీతో పోటీకాదని.. నాయకత్వంకోసం కూటమిలోని పార్టీలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయని చురకలంటించారు. ఆ కూటమిలోని ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి కావాలనే లక్ష్యం పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు కాంగ్రెస్​ నేతృత్వంలోని రిమోట్ కంట్రోల్డ్​ గవర్నమెంట్​ను కోరుకోవడం లేదని అన్నారు.