
హైదరాబాద్, వెలుగు : గత ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అమలు చేయని స్కీమ్లను ప్రచార అస్త్రాలుగా మార్చుకుంటేనే కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బకొట్టగలమని బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్ రావు అన్నారు. ప్రతిసారీ వెల్ఫేర్ స్కీమ్లను ఎర వేసి గెలవడం సాధ్యం కాదన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో గేమ్ చేంజర్లు యూత్ మాత్రమేనన్నారు.
తెలంగాణలో నిరుద్యోగ సమస్య బాగా ఉందని, 65 శాతం ఉన్న యూత్ తలచుకుంటే కేసీఆర్ ఓడిపోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. అవినీతికి పాల్పడినోళ్లు జైలుకు పోవాల్సిందేన న్నారు. జనం దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ కొత్త దుకాణం పెట్టాడని విమర్శించారు. కానీ, ఆయన జాతీయ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకం కోల్పోయిందన్నారు. గెలిచిన నేతలు ఆ పార్టీలో ఉండరనేది ప్రజల్లో బలంగా ఉందని, పైగా ఆ పార్టీకి చెందిన పెద్ద లీడర్లే పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతున్నదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం సాధ్యం కాదన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పిండం పార్టీకి నష్టం అనే ప్రచారం కరెక్టు కాదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు తక్కువ టైం ఉండడంతో కొందరు పెద్ద నేతలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని, వారిని కలుపుకొనిపోవడంలోఇబ్బందులు వస్తాయనే కారణంతో కూడా ఆయన్ను తప్పించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. పార్టీలో సీనియర్, జూనియర్ అని భేదం రాకుండా ఉండేందుకు కూడా పార్టీ అధ్యక్ష మార్పు జరిగిందని అనుకోవచ్చన్నారు. తాను మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేస్తానని మురళీధర్ రావు స్పష్టం చేశారు.