లోక్​సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్​ కనుమరుగు : పాల్వాయి హరీశ్​

లోక్​సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్​ కనుమరుగు : పాల్వాయి హరీశ్​
  • తెలంగాణ అంతటా బీజేపీ గాలి వీస్తోంది

మెదక్​, వెలుగు: తెలంగాణ అంతటా బీజేపీ గాలి వీస్తోందని, 12 కు తగ్గకుండా ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని సిర్పూర్​ కాగజ్​ నగర్​ఎమ్మెల్యే, మెదక్ లోక్​ సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి పాల్వాయి హరీశ్ అన్నారు. గురువారం రాత్రి మెదక్​ పట్టణంలో జరిగిన మెదక్​లోక్​ సభ నియోజకవర్గ పరిధి బీజేపీ బూత్​ కమిటీ అధ్యక్ష, కార్యదర్శుల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

 రాష్ట్రంలో బీఆర్ఎస్​ పని అయిపోయిందని, ఆ పార్టీని ప్రజలెవరూ నమ్మడం లేదని, లోక్​ సభ ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్​ కనుమరుగు కావడం ఖాయమన్నారు. తెలంగాణాలో బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలే మిగులుతాయన్నారు. బీఆర్ఎస్​ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అత్యంత అవినీతి పరుడైన ఆఫీసర్​గా పేరొందారని ఆరోపించారు. ఓఆర్ఆర్​ నుంచి మొదలుకుని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్​ వరకు ఆయన వాటాలు తీసుకున్నారని దుయ్యబట్టారు. అలాంటి అభ్యర్థిని ఎంపీగా గెలిపిస్తే గుడినే కాదు గుడిలోని లింగాన్ని సైతం మింగేస్తారని ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్​ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్​ ఎన్నికలకు ఓటర్ల వైఖరిలో మార్పు ఉంటుందన్నారు. 

ఎవరిని కదిలించినా ఈ సారి లోక్​ సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తామంటున్నారని, రాష్ట్రంలో 12 సీట్లు బీజేపీకి వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. బీఆర్ఎస్​ పని అసెంబ్లీ ఎన్నికల్లోనే అయిపోయిందని, ఇచ్చిన హామీలు విస్మరించిన కాంగ్రెస్​ను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. మెదక్​లోక్​ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్​ రావు​మాట్లాడుతూ బీఆర్ఎస్​ జనంతోని గెలవలేమని చెప్పి ధనంతో గెలవాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. జిల్లాలో జై తెలంగాణ అన్న వారెవరూ దొరక్క గతంలో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి దగ్గర సూట్​ కేసులు మోసి, మాజీ సీఎం కేసీఆర్​ కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న వెంకట్రామిరెడ్డికి టికెట్​ ఇచ్చారని విమర్శించారు. 

మూడేళ్లు ఎమ్మెల్సీగా ఒక్క రూపాయి ఇవ్వని వ్యక్తి, ఇపుడు తనను ఎంపీగా గెలిపిస్తే వంద కోట్లతో స్కూల్​లు పెట్టిస్తా, దవాఖానాలు కట్టిస్తా అంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్​ మోసకారి పార్టీ అని విమర్శించిన నీలం మధు ఇపుడు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారని విమర్శించారు. గడిచిన ఇరవై ఐదేళ్లుగా మెదక్ గడ్డమీద కాంగ్రెస్​ ఎంపీ గెలవలేదని ఇపుడు కూడా గెలవబోదన్నారు. బూత్​ కమిటీ బాధ్యులు ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ఓటడగాలని సూచించారు. సమావేశంలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, గోదావరి, మోహన్​రెడ్డి, నాయకులు పంజా విజయ్​కుమార్, మురళీ యాదవ్​, పులి మామిడి రాజు, దూది శ్రీకాంత్​రెడ్డి, కరణం పరిణిత, రాజశేఖర్​, ఎం ఎల్​ఎన్​ రెడ్డి, గడ్డం కాశీనాథ్​, మధు, నాయిని ప్రసాద్​ పాల్గొన్నారు.